ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్న సినిమా ఏది అంటే ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ “రౌద్రం రణం రుధిరం”. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. గత కొద్ది రోజులుగా చిత్రం బృందం మొత్తం సినిమా ప్రమోషన్స్ కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. జనవరి 7 సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు.
అయితే దేశ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటరుల తెరిచేందుకు అనుమతిచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలపై రాజుకున్న వివాదం నేపథ్యంలో.. ఆర్ ఆర్ ఆర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ లో సినిమా విడుదల ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల అవుతుండటంతో.. పలు పెద్ద చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. వీటిలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, చిరంజీవి ఆచార్య, వెంకటేష్ ఎఫ్ 3 చిత్రాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ వంటి పెద్ద చిత్రం విడుదల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ కాకుడదనే ఉద్దేశంతో ఆయా చిత్రాల మేకర్స్ విడుదలను ఏప్రిల్ కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడటమే కాక.. ఏప్రిల్ లో ప్రేక్షకుల మందుకు వస్తుందని వార్తల నేపథ్యంలో మరి ఇప్పటికే ఏప్రిల్ కి వాయిదా పడిన చిత్రాల పరిస్థితి ఏంటనే దానిపై సిని వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రతి ఏడాది సంక్రాతి సమయంలో పెద్ద చిత్రాలు సందడి చేసేవని.. ఈ సారి అవేం ఉండకపోవడంతో.. దీనంతటికి రాజమౌళినే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య..మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకతంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను తొలుత జనవరి 4న విడుదల చేయాలని భావించారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే ఆర్ ఆర్ ఆర్ జవనరి 7 న రిలీజ్ అవుతుండటంతో.. రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయితే.. కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో.. ఆచార్య విడుదలను 2022, ఏప్రిల్ కి వాయిదా వేశారు. ఆర్ ఆర్ ఆర్ కూడా ఏప్రిల్ లోనే విడుదలవనుందనే వార్తల నేపథ్యంలో మరో సారి రెండు చిత్రాల మధ్య క్లాష్ వస్తుంది.. అప్పుడేంటి పరిస్థితి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరోసారి ఆచార్యను వాయిదా వేసే ఉద్దేశం ఏ మాత్రం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని మెగా అభిమానలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
భీమ్లా నాయక్..సంక్రాతి బరిలో.. జనవరి 12 న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ కోసం వాయిదా పడటంతో.. పవన్ కల్యాణ్ అభిమానులు రాజమౌళిపై గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సంక్రాతి బరి నుంచి తప్పుకోవడంతో.. అభిమానులు పవన్ చేసిన త్యాగం వృథా అయ్యింది.. రాజమౌళి ఇలా చేయడం కరెక్ట్ కాదని మరోసారి విమర్శలు చేస్తున్నారు. అంతేకాక భీమ్లా నాయక్ చిత్రాన్ని గతంలో ప్రకటించిన జనవరి 12నే విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సర్కారు వారి పాట..మహేష్ బాబు-పరశురాం కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ సర్కారు వారి పాట 2021లో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా 2022 సంక్రాంతికి సినిమా విడుదలను వాయిదా వేశారు. అందరికంటే ముందుగానే సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2022, జనవరి 13న విడుదల చేస్తామని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రానుందని ఎప్పుడైతే ప్రకటించారో ప్రణాళికలు పూర్తిగా మారాయి. సర్కారు వారి పాటసినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించి సమ్మర్ లో విడుదల చేయాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయ్యింది. అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చేయాలని భావించింది.
ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి సినిమాను తప్పించడంతో మహేష్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ కూడా ఏప్రిల్ లోనే విడుదల చేస్తారనే వార్తలతో.. మరో సారి సర్కారు వారి పాట విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి సినిమా విడుదలను వాయిదా వేసే ఉద్దేశం మేకర్స్ కి లేదని… మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు సినీ విశ్లేషకులు.
ఎఫ్3….అలానే వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 3 చిత్రాన్ని తొలుత సంక్రాతి బరిలో విడుదల చేయాలని భావించారు. కానీ ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ ప్రకటించడంతో.. విడుదలను వాయిదా వేశారు. 2022, ఫిబ్రవరి 25 కు చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడటంతో.. ఎఫ్ 3 విడుదలపై మరోసారి సందిగ్ధం నెలకొంది. ఎఫ్ 3 సంక్రాతికి విడుదల అయ్యే చాన్స్ ఏ మాత్రం లేదు.
మొత్తానికి సంక్రాతి బరి నుంచి అన్ని సినిమాలను తప్పించిన రాజమౌళి.. తన సినిమాను కూడా రిలీజ్ చేయడం లేదనే వార్తలతో సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంది పెద్ద హీరోలను తప్పించిన జక్కన్న తన సినిమాను కూడా రిలీజ్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.