దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో RRR ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ మూవీ గతేడాది కాలంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు RRR సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రతిసారి కరోనా పరిస్థితులు తారుమారు చేస్తూ వచ్చాయి.
ఈ ఏడాది జనవరి 7న రిలీజ్ అని ప్రమోషన్స్ జరిపిన తర్వాత సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో RRR ఫ్యాన్స్ అంతా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ ని ప్రశ్నించడంతో డైరెక్టర్ రాజమౌళి బృందం తాజాగా రెండు విడుదల తేదీలను ప్రకటించి ఆశ్చర్యపరిచింది. RRR సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల ప్లాన్ చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ప్రకటించాల్సి వస్తోందని చెప్పడం విశేషం. పరిస్థితులు బాగుంటే మార్చి 18న రిలీజ్ చేస్తామని లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించడంతో మిగతా పెద్ద సినిమాల మేకర్స్ షాకవుతున్నారు.
మొన్నటివరకు పుకార్లుగా వినిపించిన ఈ రెండు తేదీలపై రాజమౌళి ఏకంగా కర్చీఫ్ వేసేశాడు. దీంతో మిగిలిన పెద్ద సినిమాలు సందిగ్ధంలో పడినట్లయింది. మెగాస్టార్ ఆచార్య మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ అనుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అలాగే ఫిబ్రవరి 25న కుదరకపోతే.. తాము కూడా మరో రిలీజ్ డేట్ చూస్తామని భీమ్లా నాయక్ టీమ్ భావిస్తోంది. మరోవైపు రాధేశ్యామ్ మేకర్స్ మే 13న రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022
ఇలాంటి పెద్ద సినిమాల నిర్మాతలు ఏం చేయనున్నారు? అనేది ఏమి తెలియని పరిస్థితి నెలకొంది. RRR మూవీకి రెండు డేట్లు లాక్ చేయడంతో తదుపరి రెండు వారాలు వేరే సినిమాలు ప్రకటించే అవకాశం లేదు. ఓ విధంగా రెండు విడుదల తేదీలతో RRR దాదాపు నెలన్నర పైగా గ్యాప్ కవర్ చేసినట్లే అని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి RRR విషయం తేలిపోయింది కాబట్టి మిగతా సినిమాలు ఎప్పుడనేది చూడాలి. చివరిగా RRR రిలీజ్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.