బ్యానర్: సన్ పిక్చర్స్
నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, యోగిబాబు, తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: ఆర్.నిర్మల్
సంగీతం: అనిరుధ్
నిర్మాత: కళానిధి మారన్
రచన – దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
తమిళ స్టార్.. దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే తెలుగులో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ మార్కెట్ డెవలప్ చేసుకుంటున్నాడు. విజయ్ నటించిన స్నేహితుడు మొదలుకొని నిన్నటి మాస్టర్ వరకు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ బీస్ట్. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఇది. కోకోకోకిల, డాక్టర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. బీస్ట్ మూవీని రూపొందించాడు. దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించిన ఈ సినిమా.. పాటలు, ట్రైలర్ ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెంచేసాయి. అనిరుధ్ సంగీతం ఈ సినిమాపై ఎక్సపెక్టషన్స్ పెరిగేలా చేసింది. సన్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దళపతికి మరో బ్లాక్ బస్టర్ అందించిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథపవర్ ఫుల్ రా ఏజెంట్ వీర రాఘవన్(విజయ్).. ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్ అయినా తనదైన బీస్ట్ స్టయిల్ లో సక్సెస్ చేస్తుంటాడు. జోద్ పూర్ లో ఉమర్ ఫరూక్ అనే టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకునే ఆపరేషన్ లో అనుకోని పొరపాటు వలన ఓ చిన్నారి చనిపోతుంది. ఈ విషయం తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లిన వీర.. రా ప్రొఫెషన్ కి దూరంగా ఉంటాడు. అలా సింపుల్ లైఫ్ గడుపుతుండగా.. ఓ వెడ్డింగ్ పార్టీలో వీరకి ప్రీతి(పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. మొదటి పరిచయంలోనే ఇద్దరు ఒకరికి ఒకరు ఓకే చెప్పేసుకుంటారు.
కట్ చేస్తే.. సముద్రతీరంలో ఉన్న ఈస్ట్ కోస్ట్ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. టెర్రరిస్ట్ లు ఆ మాల్ లో ఉన్నవాళ్లను బంధించి.. తమ నాయకుడు ఉమర్ ఫరూక్ ని జైలు నుండి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అయితే.. ఆ మాల్ లో బంధీ అయినవాళ్లలో వీర రాఘవన్, ప్రీతి కూడా ఉంటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మరి హైజాక్ అయిన ఈస్ట్ కోస్ట్ మాల్ ని టెర్రరిస్ట్ ల నుండి కాపాడేందుకు వీర రాఘవన్ ఎలాంటి సాహసాలు చేశాడు? అతనికి ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది? టెర్రరిస్ట్ లు తమ నాయకుడిని విడిపించుకున్నారా లేదా? చివరికి వీర – ప్రీతిల లవ్ స్టోరీ ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:దళపతి విజయ్ లాంటి హీరో.. భారీ బడ్జెట్.. బెస్ట్ టెక్నికల్ టీమ్, సపోర్టింగ్ కాస్ట్ ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా మాక్సిమమ్ బెస్ట్ మూవీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దళపతి విజయ్ ని పూర్తి స్థాయిలో యూస్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో అట్లీ ఓ రకంగా చూపిస్తే.. లోకేష్ కనగరాజ్ ఓ విధంగా చూపించాడు.. ఏఆర్ మురుగదాస్ మరోలా చూపించాడు. అయితే.. ఎవరు ఎలా చూపించినా హీరో విజయ్ మేనరిజంలో మాత్రం మార్పు కనిపించలేదు. బీస్ట్ సినిమాలో విజయ్ ని వీలైనంత వయోలెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నెల్సన్. కానీ విజయ్ లో కొత్త స్టైల్, లుక్ ని మాత్రం రాబట్టలేకపోయాడు.
మంచి ఎమోషనల్ టచ్ తో సినిమా మొదలవుతుంది. కానీ సినిమాను పూర్తిస్థాయిలో గ్రిప్పింగ్ గా రాసుకోలేకపోయాడు దర్శకుడు. మూవీలో విజయ్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాసీవ్ యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. కథను ఆసక్తికరంగా చెప్పకుండా.. కేవలం విజయ్ ని చూపించి సక్సెస్ అవుదాం అనుకున్నట్లుగా ఉంది. సినిమా అంతా హైజాక్ అయిన ఈస్ట్ కోస్ట్ మాల్ లోనే సాగుతుంది. కాబట్టి ప్రేక్షకులు కొత్తగా ట్విస్టులు ఎక్సపెక్ట్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. కొన్నిచోట్ల ఒకే ప్లేస్ లో సినిమా సాగుతుంది కదా అని బోర్ కొట్టే అవకాశం ఉంది.విజయ్ ని బీస్ట్ లా చూపించిన తీరు బాగుంది. సినిమాలో మైనస్ ఏంటంటే.. టెర్రరిస్ట్ లను హీరోకి తగిన స్థాయిలో బలంగా చూపించలేకపోవడం. ముఖ్యంగా టెర్రరిస్ట్ లకు బంధీ అయినవారు కూడా పెద్దగా బయపడటానికి ఏం లేదు. అంతా నార్మల్ గా కూర్చుంటారు. అటు టెర్రరిస్ట్ లు, ఇటు చేసే విన్యాసాలు చూస్తూ ఉంటారు. సినిమాలో కామెడీ బాగుంది. డాక్టర్ సినిమాలో ఉన్న కమెడియన్స్ అంతా బీస్ట్ లో కూడా ఉన్నారు. వాళ్లతో కామెడీ సీక్వెన్స్ బాగా రాసుకున్నాడు దర్శకుడు నెల్సన్. సినిమాలో మరో ప్రధాన మైనస్ టెర్రరిస్ట్ నాయకుడు. ఫోన్ కాల్స్ లో గంభీరంగా మాట్లాడే వాయిస్ ఉంది.. కానీ హీరో ముందు తేలిపోయేలా ఉన్నాడు. చూడటానికి కూడా విలన్ పర్సనాలిటీ, టెర్రరిస్ట్ లుక్ లేదు. వీక్ విలనిజం.
బీస్ట్.. సింగిల్ లైన్ స్టోరీతో కేవలం విజయ్ యాక్షన్, కామెడీతో అడ్జెస్ట్ చేసుకోవాలి అన్నట్లుగా తెరమీదకు తీసుకొచ్చారు మేకర్స్. ఆ మాల్ లో జరిగేది చూసి ఎంజాయ్ చేయొచ్చేమో గాని ప్రేక్షకులు ఎగ్సైట్ మాత్రం కాలేరు. సినిమాలో మరో వీక్ పాయింట్ క్లైమాక్స్. టెర్రరిజం వీక్ ఉన్నప్పటికీ టెర్రరిస్ట్ లీడర్ ఉమర్ ఫరూక్ ని వదిలేయడం.. మాల్ లో జనాలు సేఫ్ అయ్యాక హీరో జెట్ లో వెళ్లి ఉమర్ ఫరూక్ ని మట్టు పెట్టడం.. అతనికి గవర్నమెంట్ జెట్స్ సహాయంగా పంపడం లాంటి సీన్స్ మధ్య ఏమాత్రం బలమైన లింక్స్ లేవు. బీస్ట్ ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన మూవీ కాదు.ఇలాంటి హోస్టేజీ డ్రామాలలో కాస్ట్యూమ్స్ ఛేంజ్ ఉండదు. ఒకే స్టోరీ లైన్. వేరే ఎమోషన్స్ ఉండవు. యాక్షన్.. రియాక్షన్ అన్నట్లుగా స్క్రీన్ ప్లే సాగిపోతుంది. అలాంటి రిస్క్ చేశాడు డైరక్టర్ నెల్సన్. స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోయినా విజయ్ ఇమేజ్, పూజా గ్లామర్, కామెడీలతో సినిమా నడిపించవచ్చు అనుకున్నాడేమో.. కానీ దురదృష్టవశాత్తు వీటిల్లో కొద్దోగొప్పో కామెడీ ఒకటే వర్కవుట్ అయింది.
“కోకోకోకిల, డాక్టర్ సినిమాలలో లాగా ఇందులోనూ డార్క్ హ్యూమర్ ట్రై చేశారు. విజయ్ ఫ్యాన్స్ కోరుకునే బలమైన ట్విస్టులు, మాసీవ్ ఇంటర్వెల్ బ్యాంగ్, అద్భుతమైన క్లైమాక్స్ బీస్ట్ లో లోపించాయి. హీరోయిన్ పూజా హెగ్డేకి ఈ సినిమాలో అటు గ్లామర్ పరంగా, ఇటు నటనపరంగా స్కోప్ లేకుండా పోయింది. అలా కమెడియన్స్ లో ఒకరిలా ఉండిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో అరబిక్ కుత్తు సాంగ్, సెకండ్ హాఫ్ లో బీస్ట్ మోడ్ మాత్రమే ఉంటాయి. బీస్ట్ కి ప్రధానబలం మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్. మనోజ్ కెమెరా పనితనం కట్టిపడేస్తుంది. అందుకు తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు అనిరుధ్. సౌండ్ డిజైనింగ్ కూడా సినిమాకు మరో బలం. ఈ ముగ్గురు బీస్ట్ కి 100శాతం న్యాయం చేశారు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కానీ ఒకే చోట జరిగే కథకు అంత భారీ బడ్జెట్ ఎలా పెట్టారా అనే సందేహం రాకమానదు. ఫస్ట్ టైమ్ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడుగా కనిపించడం విశేషం. చివరిగా ఇది దళపతి విజయ్ రేంజి బీస్ట్ కాదు అని ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి చివరికి సినిమా ఏ వైపు నిలుస్తుందో..!
విజయ్ పెర్ఫార్మన్స్
సినిమాటోగ్రఫీ
సంగీతం
కామెడీ పార్ట్
వీక్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే
ఎమోషన్స్, లవ్ లోపించడం
బలమైన విరోధి లేకపోవడం
హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్
చివరిమాట: పట్టుతప్పిన బీస్ట్ వయలెన్స్..!
(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత కోణానికి సంబంధించింది మాత్రమే. గమనించగలరు)
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.