నటీ నటులు: శ్రీవిష్ణు, కేథరిన్, రామచంద్రరాజు, పోసాని కృష్ణ మురళి
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్
కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి
నిర్మాత: రజని కొర్రపాటి
బ్యానర్: వారాహి చలన చిత్రం
రిలీజ్ డేట్: 06-05-2022
శ్రీ విష్ణు.. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బ్రోచేవారెవరురా మూవీ తర్వాత విష్ణుకి కరెక్ట్ హిట్ పడలేదు. కానీ, శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలే ఎంచుకుంటుంటాడు. అలా రాజ రాజ చోర, అర్జున ఫాల్గుణ తీశాడు. కానీ, ఆ మూవీలు అనుకున్నంత అలరించలేదు. ఇప్పుడు భళా తందనాన అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, శ్రీవిష్ణు చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది? విష్ణు హిట్ కొట్టాడా ఇప్పుడు చూద్దాం.
కథ
చందు(శ్రీవిష్ణు) ఓ ఎన్జీవోలో అకౌంటెంట్ గా పనిచేస్తుంటాడు. అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతుండటం అతని దృష్టికి వస్తుంది. ఆ అక్రమాలను బయటపెట్టేందుకు చందు క్రైమ్ రిపోర్టర్ అయిన శశిరేఖ(కేథరిన్)ని హెల్ప్ అడుగుతాడు. అనాథాశ్రమంలో జరిగే విషయాలు వెలికితీసే క్రమంలో వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ గ్యాప్ లో కొన్ని వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలకు సంబందించి శశిరేఖ పరిశోధన చేయడం మొదలు పెడుతుంది. అయితే చనిపోయిన వారిలో కొంతమందిని తాను చూసినట్లు చందు చెబుతాడు. ఆ హత్యల వెనకాల హవాలా కింగ్ ఆనంద్ బాలి(కేజీఎఫ్ గరుడ) ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ఆ హత్యలకు హవాలాకి ఏంటి సంబంధం? శశిరేఖ ఎలాంటి విషయాలను తెలుసుకోగలిగింది? శ్రీవిష్ణు ఈ హత్యల్లో ఎలా ఇరుక్కుంటాడు అనేది కథ
విశ్లేషణ
క్రైమ్ థ్రిల్లర్ జానర్ తో తెరకెక్కిన చిత్రమే అయినా.. డైరెక్టర్ చైతన్య దంతులూరి హాస్యం, ప్రేమ కూడా జోడించాడు. అయితే పాటలు, ప్రేమ సన్నివేశాల వల్ల అసలు కథ కాస్త గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం నటీనటులు, వారి పాత్రలు పరిచయం చేయడం, ముల్లంగిలో హీరో ప్రేమ గురించే చూపించారు. అసలు కథ ద్వితియార్థంలోనే ప్రారంభం అవుతుంది. వరుస హత్యల తర్వాత కథ ఊపందుకుంటుంది. సినిమాలో ఓ థ్రిల్లర్ కథకు కావాల్సిన ట్విస్టులు, మలుపులు బాగానే ఉన్నాయి. తన రూపాయి కోసం లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టే మనస్తత్వం కలిగిన విలన్ తో పోరాటం ఆసక్తిగా సాగుతుంది. అయితే 2 వేల కోట్ల హవాలా డబ్బును మాయం చేయడం, ఆ క్రైమ్ లో హీరో ఇరుక్కోవడం ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాగ్ ఏంటి? హవాలా సొమ్ము ఏమైంది? అనే అంశాలను చెప్పకుండా.. ఇంకో భాగం ఉంది అని చెబుతూ సినిమా ముగిస్తారు.
నటీనటుల పనితీరు
శ్రీవిష్ణు ఎప్పటిలాగానే తన పాత్రకు న్యాయం చేశాడు. మొదటి భాగంలో అమాయకపు పాత్రలో, రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్ తో రెండు విభిన్న పాత్రలతో మెప్పించాడు. కేథరిన్ క్రైమ్ రిపోర్టర్ గా పాత్రకు న్యాయం చేసింది. తెలుగును ఇంగ్లీష్ ఫ్లేవర్ లో డెలివర్ చేస్తూ.. సొంతగా చెప్పుకున్న డబ్బింగ్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో రామచంద్రరాజు ఆకట్టుకున్నాడు. కాకపోతే అతని విగ్ మాత్రం కాస్త ఇబ్బందిగా, నప్పకుండా ఉంది. పోసాని కృష్ణ మురళి కూడా ప్రతి నాయకుడి పాత్రతో మెప్పించారు. టెక్నికల్ టీమ్ పనితీరు కూడా ఎంతో రిచ్ గా ఉంటుంది. మణిశర్మ బాణీలు, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి.
ప్లస్ లు
కథ, కథనం
నటీనటులు
మైనస్ లు
సీన్స్ లో సాగదీత
సస్పెన్స్ థ్రిల్లర్ లో కామెడీకి ప్రాధాన్యత
చివరి మాట: శ్రీవిష్ణు సస్పెన్స్ లో కూడా నవ్విస్తాడు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.