చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
డీసెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. శతమానం భవతి, మహానుభావుడు తర్వాత ఇప్పటివరకు శర్వాకి మంచి హిట్టు పడలేదు. మధ్యలో చాలా జానర్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. ఇక లాభం లేదని తనకు సక్సెస్ అందించిన ఫ్యామిలీ డ్రామానే ఎంచుకొని ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా చేశాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి మొదటి శుక్రవారం(మార్చి 4న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
చిరంజీవి(శర్వానంద్) ముప్పై ఏళ్లు వయసు మీదపడి పెళ్లి కోసం ఆరాటపడుతుంటాడు. తనకు ఏ సంబంధం వచ్చినా ఇంట్లో ఆడవాళ్ళు.. అమ్మాయిలకు ఏదో ఒక వంకపెట్టి రిజెక్ట్ చేస్తుంటారు. ఇక తనకు పెళ్లే కాదేమో అనుకుంటున్న తరుణంలో ఆద్య(రష్మిక మందన) తారసపడుతుంది. తొలిచూపులోనే ఆద్యతో ప్రేమలో పడతాడు చిరు. కానీ ఆద్య లైఫ్ లో పెళ్లి అనే కాన్సెప్ట్ కి చాలా దూరంగా ఉంటుంది. మరి పెళ్లే వద్దనుకునే ఆద్యను చిరు ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో ఇంట్లో ఆడవాళ్ళతో ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఎలా మేనేజ్ చేశాడు? చివరికి పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగిలిన కథ.
ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఇంటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకుని తెరకెక్కించారు. వయసు మీదపడినా పెళ్లి కాని ఓ బ్యాచిలర్ పాత్రకు మంచి కథ, బలమైన ఎమోషన్స్, కామెడీ జోడించి అన్ని విధాలా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేసే క్రమంలో వచ్చిన సంబంధాలను వంకలతో రిజెక్ట్ చేస్తుంటుంది అతని తల్లి. ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళది ఇదే తంతు. ఇలాంటి.. హెల్తీ కామెడీతో సినిమా ప్రారంభమైంది. చిరంజీవిగా శర్వానంద్ పెళ్లి కోసం పడే కష్టాలు.. చాలా క్లీన్ అండ్ నీట్ గా ప్రెసెంట్ చేశాడు దర్శకుడు.
ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్షకులకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ ఎమోషన్స్, కావాల్సినంత కామెడీతో.. మంచి విందు భోజనంలా రెడీ చేశాడు దర్శకుడు. చిరంజీవి పాత్రలో శర్వానంద్ మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు సినిమాల తర్వాత శర్వా నుండి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఐదేళ్లుగా ఫ్లాప్ సినిమాల్లో చిక్కుకున్న శర్వానంద్ ను.. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. లవ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో మెరుగైన నటన కనబరిచాడు.
ఈ సినిమాలో ఆద్యగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఆకట్టుకుంది. పుష్ప మూవీతో రష్మికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అవ్వడంలో రష్మిక సక్సెస్ అయ్యింది. శ్రీవల్లిగా ఫుల్ గ్లామరస్ రోల్ లో కనిపించిన రష్మిక.. ఈ సినిమాలో తెలుగుదనం ఉట్టిపడే ఆద్యగా కనిపించడం విశేషం. దర్శకులు ఆద్య క్యారెక్టర్ ని బలంగా, అందంగా చూపించడంలో విజయం సాధించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు రష్మికకు మరో మంచి హిట్ ఇచ్చినట్లే. ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటులున్నారు. లక్ష్మమ్మగా రాధికా శరత్ కుమార్, పద్మమ్మగా ఊర్వశి.. చిరుకి అమ్మలుగా అదరగొట్టారు.
సినిమాలో చాలామంది పేరున్న యాక్టర్స్ ఉండటంతో అందరి పాత్రలకు స్కోప్ ఉండాలని కోరుకోలేం. ఎవరిని మెయిన్ చేయాలో వారి పాత్రల చుట్టూనే స్క్రిప్ట్ రాసుకున్నారు. చాలాకాలం తర్వాత రాధికా శరత్ కుమార్, ఊర్వశిలకి మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఊర్వశి ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. అలాగే హీరోయిన్ తల్లి వకుల పాత్రలో ఖుష్బు నటించింది. ఆమె క్యారెక్టరైజేషన్ ను దర్శకుడు చాలా బలంగా డిజైన్ చేశాడు. ఒక ఇండిపెండెంట్ మదర్.. భర్త లేకుండా లైఫ్ లో సక్సెస్ అయింది.. కూతురుని పెంచింది అనేందుకు ఉదాహరణగా ఖుష్బు పాత్ర ఉంటుంది. కచ్చితంగా అందరు పేరెంట్స్ కి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో హీరో తరపు ఆడవాళ్ళకి ఉన్న స్కోప్ మగాళ్లకి ఉండదు. చాలా తక్కువ సీన్లలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. సినిమాలో స్టోరీ, ఎమోషన్స్ తో పాటు కామెడీ బిగ్గెస్ట్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో శర్వానంద్, తన ఫ్రెండ్ ఫణి(వెన్నెల కిషోర్) కామెడీతో నవ్వించారు. సెకండ్ హాఫ్ లో సత్య కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించగలరు.. రాయగలరని ఇదివరకే ప్రూవ్ చేసుకున్నారు. ఇంటర్వెల్ సీన్స్ అయితే.. నేను శైలజ, చిత్రలహరి ట్విస్టులను గుర్తు చేస్తాయి. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాను చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. ఇక మరోసారి కిషోర్ తిరుమల మార్క్ చూపించి మెప్పించారు.
ఆడవాళ్ళు మీకు జోహార్లు.. స్టోరీ లైన్ చిన్నదే అయినా సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి.. ఎన్నో బలమైన ఎమోషన్స్ ని టచ్ చేస్తుంది. ఈ విషయంలో రచయితగా కిషోర్ తిరుమల పెన్ పవర్ కనబరిచారు. సినిమాకి మేజర్ ప్లస్ సంగీతం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సందర్భానికి తగిన పాటలతో.. సన్నివేశాలకి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ కిషోర్ తో ఉన్న ర్యాపో కారణంగా మ్యూజిక్ అదరగొట్టాడని చెప్పవచ్చు. ఎక్కడా బోర్ ఫీలింగ్ రాకుండా బిజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్.. ఎన్నో ఏళ్ల అనుభవం, నేషనల్ అవార్డులు అందుకున్న ఆయన ఈ సినిమాకి బోనస్. సినిమా స్క్రీన్ ప్లేలో స్లో అవ్వకుండా.. అనవరమైన సీన్స్ కట్ చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి.. ఫ్యామిలీ సబ్జెక్టుని ఎంచుకోవడమే కాకుండా అంతే గ్రాండ్ గా సినిమాని నిర్మించి.. మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పవచ్చు.
కొన్ని పాత్రలకు స్కోప్ లేకపోవడం
ఆడవాళ్ళు.. ఇది పక్కా ఫ్యామిలీ సినిమా గురూ!