చిత్రం: రాధేశ్యామ్
నటీనటులు: ప్రభాస్, పూజాహెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు
బ్యానర్: యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నేపథ్యసంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
రచన – దర్శకత్వం: కె.కె. రాధాకృష్ణకుమార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రెండున్నర ఏళ్ల తర్వాత పీరియడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా దాదాపు నాలుగేళ్లుగా వార్తల్లో నిలుస్తూ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నుండి లవ్ స్టోరీ వస్తుందనే సరికి అందరిలోను ఆసక్తి ఏర్పడింది. రాధేశ్యామ్ ట్రైలర్స్, సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచి పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పీరియడిక్ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన రాధేశ్యామ్ చిత్రం విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దాం!
విక్రమాదిత్య(ప్రభాస్) మోస్ట్ పాపులర్ పామిస్ట్(హస్తసాముద్రికనిపుణుడు). కొన్ని కారణాల వలన ఇండియా వదిలి ఇటలీలో నివసిస్తుంటాడు. పామిస్ట్ గా విక్రమాదిత్య చెప్పేవన్నీ వందశాతం నిజమవుతుంటాయి. అయితే.. అందరి చేతి రేఖలు చూసి ఫ్యూచర్ చెప్పే విక్రమాదిత్య.. తన రేఖలలో ప్రేమ, పెళ్లికి చోటులేదని తెలుసుకొని ఫుల్ క్లారిటీతో లైఫ్ గడిపేస్తుంటాడు. అనుకోకుండా ఒకరోజు డాక్టర్ ప్రేరణ(పూజాహెగ్డే)ని కలుసుకుంటాడు. తొలిచూపులోనే ఆమెను ఇష్టపడి ఆమెకు దగ్గరవుతాడు. కానీ విధిరాతను ఎవరు మార్చలేరని చెప్పి ఆమెకు దూరంగా ఉండేందుకు ట్రై చేస్తాడు. మరి చివరికి విక్రమాదిత్య – ప్రేరణల లవ్ స్టోరీ ఏమైంది? విధిరాతను ఎదురించి వీరి ప్రేమ గెలిచిందా లేదా? ప్రేమకు, విధికి మధ్య ఇద్దరి జీవితాలు ఎలాంటి సంఘర్షణకు గురయ్యాయి? అనేది మిగిలిన కథ.
డార్లింగ్ ప్రభాస్ నుండి లవ్ స్టోరీ వచ్చి చాలాకాలం అయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ తర్వాత ప్రభాస్ నుండి కంప్లీట్ లవ్ స్టోరీగా వచ్చింది రాధేశ్యామ్. విధికి, ప్రేమకు ముడిపెడుతూ.. ఫ్యూచర్ అనేది చేతి రేఖల్లో కాదు, చేతల్లో ఉంటుందని చెబుతోంది రాధేశ్యామ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయి మించిపోవడంతో.. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ముందునుండి చెప్పినట్లుగానే కంప్లీట్ లవ్ స్టోరీతో తెరకెక్కింది ఈ సినిమా. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లవ్ స్టోరీ అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ ఫేమస్ పామిస్ట్ విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టర్ ని పరిచయం చేసిన దర్శకుడు.. ఇంటర్వెల్ వరకు అసలు స్టోరీ చెప్పకుండా సాగించాడు.
డాక్టర్ ప్రేరణతో పరిచయం, లవ్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సరిపెట్టే ప్రయత్నం చేసి.. ఇంటర్వెల్ టైంలో అసలు ట్విస్టుతో కథలోకి తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ లో సినిమా స్పీడ్ గా సాగుతుంది. కానీ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నుండి ఎక్సపెక్ట్ చేసే మాస్ సీన్స్, ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించే స్థాయి సీన్స్ ఎక్కడ కూడా కనిపించవు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయాడు దర్శకుడు. అయితే.. క్లాస్ లవ్ స్టోరీ కావడంతో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే స్కోప్ లేకుండా పోయింది. ప్రభాస్ నుండి సగటు ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసే సీన్స్ అయితే ఈ సినిమాలో లేవని చెప్పాలి. కాకపోతే సినిమాలో ప్రభాస్ స్టైలిష్ గెటప్, క్యారెక్టర్ అప్పియరెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇంటర్వెల్ ట్విస్టుతో ఇంటరెస్టింగ్ గా మొదలైన రాధేశ్యామ్ సెకండ్ హాఫ్.. స్టోరీతో దర్శకుడు ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేసరికి ఫ్యాన్స్ అంతా పూర్తిస్థాయిలో ఎమోషనల్ సీక్వెన్స్ లోకి వెళ్ళిపోతారు. అద్భుతమైన విజువల్స్ కారణంగా సినిమా క్లైమాక్స్ లో ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా యూరప్ అందమైన లొకేషన్స్ లో.. విక్రమ్ – ప్రేరణల మధ్య లవ్ ట్రాక్ తో ఆహ్లాదంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో అంతా సీరియస్ లవ్ డ్రామాతో సాగుతుంది. సినిమాలో ప్రభాస్ కొత్తగా, చాలా స్టైలిష్ గా కనిపించాడు. అలాగే లవ్, ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ప్రేరణగా పూజాహెగ్డే మంచి నటన కనబరిచింది. ఇదివరకు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా పండించింది. విక్రమాదిత్య గురువు పరమహంస క్యారెక్టర్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మెప్పించారు.
మిగిలిన పాత్రలు జయరాం, ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ, హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ, కమెడియన్ ప్రియదర్శి పరవాలేదనిపించారు. రాధేశ్యామ్ కంప్లీట్ లవ్ స్టోరీ కావడంతో సినిమాలో పెద్దగా కామెడీ ట్రై చేయలేదు మేకర్స్. రాధేశ్యామ్ కి మేజర్ ప్లస్ అంటే.. జస్టిన్ ప్రభాకరణ్ పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ కి, తమన్ బీజీఎం మరింత ప్లస్ అయింది. సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీనే బోర్ ఫీలింగ్ రాకుండా చేసాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే స్లో అయింది. పామిస్ట్రీ సబ్జెక్టు ఎంచుకున్న దర్శకుడు.. పామిస్ట్ విక్రమాదిత్య క్యారెక్టర్ ని మరింత డెప్త్ గా చూపించి ఉంటే బాగుండేది. కేవలం ప్రభాస్, పూజాల మధ్య లవ్, ఎమోషన్స్ తోనే కథను నడిపించడంతో ఫ్యాన్స్ కి కూడా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
కానీ ప్రభాస్ క్యారెక్టర్ ని క్లాస్ గా ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీద ఎక్కడ కూడా రాజీపడినట్లు లేరు. అందుకే ఓవరల్ గా రాధేశ్యామ్.. విజువల్లి గ్రాండ్ గా తెరకెక్కింది. సబ్జెక్టు పక్కనపెడితే.. అక్కడక్కడా కొన్ని ఓల్డ్ మూవీస్ లోని లవ్ సీన్స్ రిపీట్ అయినట్లు అర్థమవుతుంది. చివరిగా కథాకథనాలు నెమ్మదించినా.. అద్భుతమైన విజువల్స్, ప్లీజంట్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటుంది రాధేశ్యామ్. ఇక సరిగ్గా రాధేశ్యామ్ రిలీజ్ సమయానికి ఏపీలో టికెట్లరేట్లు పెంచుతూ కొత్త జీఓ వచ్చేసింది. కాబట్టి ఈ విషయంలో రాధేశ్యామ్ కి కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ – పూజాహెగ్డే యాక్టింగ్
స్టోరీ పాయింట్, లవ్ ట్రాక్
సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ సీన్స్ లేకపోవడం
సన్నివేశాల సాగదీత
విజువల్ ఫీస్ట్ కానీ.. ‘స్లో’గా సాగింది!