స్టార్ గా మాత్రమే కాకుండా నటుడిగా విక్రమ్ స్థాయి గురించి అందరికీ తెలిసిందే. నటనకి ఆస్కారం ఉండే కథలను ఎంచుకుని, ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి నటించండం విక్రమ్ కి అలవాటు. ఈ నేపధ్యంలో విక్రమ్.. తన కొడుకు ధ్రువ్ విక్రమ్ తో కలిసి నటించిన “మహాన్” మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి.. వైవిధ్యభరితమైన చిత్రాలకి కేరాఫ్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:గాంధేయవాదుల కుటుంబం నుండి వచ్చిన మహాన్ మద్యం ముట్టకుండా 40 ఏళ్ళు జీవిస్తాడు. కానీ.., అక్కడి నుండి జీవితంలో తనకు నచ్చినట్టు ఉండాలని 40వ పుట్టిన రోజున నాడు మందు తాగుతాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలిసి అతన్ని ద్వేషిస్తారు. చివరికి అతని భార్య సైతం బిడ్డని తీసుకుని మహాన్ కి దూరంగా వెళ్ళిపోతుంది. తరువాత కాలంలో మహాన్ ఏపీలో లిక్కర్ సామ్రాజ్యానికి మహారాజుగా ఎదుగుతాడు. అతనికి సత్యవాన్ తోడవుతాడు. వీరిద్దరూ తమకి ఎదురులేదు అనుకుంటున్న సమయంలో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ‘దాదా’ భాయ్ నౌరోజీ (ధ్రువ్ విక్రమ్) వీరిని టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో తనని అడ్డుకుంటున్న స్పెషల్ ఆఫీసర్ తన కొడుకే అని మహాన్ కి తెలుస్తుంది. ఇక్కడ నుండి వీరి మధ్య పోరాటం ఏ మలుపు తీసుకుంది? ఇందులో ఉప ముఖ్యమంత్రి జ్ఞానం (‘వెట్టై’ ముత్తు కుమార్) పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:సినిమా తప్ప మరో లోకం తెలియని నటుడు విక్రమ్. కథ బాగుంటే ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటాడు. మహాన్ విషయంలో కూడా విక్రమ్ ఇలానే కష్టపడ్డాడు. తనదైన నటనతో దుమ్ము లేపేశాడు. ఇక ధ్రువ్ విక్రమ్ కూడా తన తండ్రితో పోటీపడి నటించాడు. కథ పరంగా చూసుకున్నా కూడా మహాన్ మంచి కథే. ధ్రువ్ విక్రమ్ ఎంట్రీ… అతను తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ కి ధియేటర్స్ లో అయితే భారీగా విజిల్స్ పడేవి. ఇలా అంతా బాగానే ఉన్నా, సమస్య అంతా కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ లోనే వచ్చింది.
“పిజ్జా” మూవీ నుండి కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ.., ఈ మధ్య కాలంలో కార్తీక్ సుబ్బరాజ్ తన సినిమాలను స్లో నేరేషన్ తో తెరకెక్కిస్తుండటం ప్రేక్షకులకి ఇబ్బందిగా మారింది. మహాన్ లో కూడా ఇదే సమస్య రిపీట్ అయ్యింది. తప్పుడు దారిలో వెళ్తున్న తండ్రికి పోలీస్ రూపంలో కన్న కొడుకే అడ్డు రావడం అనేది కొత్త పాయింట్ కాదు. సీనియర్ యన్టీఆర్ కాలం నుండి ఈ లైన్ వాడుకలోనే ఉంది. మరి.. ఇంత సులభమైన కథని ఎస్టాబ్లిష్ చేయడానికి కార్తీక్ సుబ్బరాజ్ ఫస్ట్ ఆఫ్ అంతా వాడుకున్నాడు.సెకండ్ ఆఫ్ లో మాత్రమే అసలు కథ మొదలవుతుంది. ఇక చాలా సీన్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నా.., స్లో నరేషన్ కారణంగా వాటి స్థాయి పడిపోయింది. చాలా రోజుల తరువాత సిమ్రాన్ కి మంచి పాత్ర దొరికింది. బాబీ సింహా నటనతో ఆకట్టుకున్నారు. బాబీ సింహా కుమారుడిగా నటించిన సనంత్, ముత్తు కుమార్ పర్వాలేదు అనిపించారు. ఇక టెక్నీకల్ గా కూడా మహాన్ లో ఎలాంటి లోపాలు లేవు. దర్శకుడు కథనంపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే మహాన్ స్థాయి మరోలా ఉండేది.
పాజిటివ్ పాయింట్స్:
విక్రమ్ నటన
విక్రమ్ – ధృవ్ కాంబో
కథ
సెకండ్ ఆఫ్
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
ఫస్ట్ ఆఫ్
చివరి మాట:
విక్రమ్ వర్సెస్ ధృవ్ విక్రమ్..