F3 Movie Review In Telugu: ఈ మధ్యకాలంలో హిట్టు సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. మొదటి సినిమాను బట్టి సీక్వెల్ పై అంచనాలు ఏర్పడుతుంటాయి. ఈ సీక్వెల్స్ లైన్ లో హీరోలు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా కూడా చేరింది. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తెరకెక్కించిన F2 మూవీ 2019లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ హిట్టును కంటిన్యూ చేస్తూ నిర్మాత దిల్ రాజు – డైరెక్టర్ అనిల్ రావిపూడి F3 మూవీని రూపొందించారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ బిగ్ స్క్రీన్ పై కనిపించడం, గని ప్లాప్ తర్వాత వెంటనే వరుణ్ నుండి ఈ సినిమా రావడం.. ఇద్దరికి సమ్మర్ సోగ్గాళ్ళుగా కంబ్యాక్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎఫ్3తో తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తానని ప్రమోషన్స్ లో బలంగా చెప్పడం సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. అదిగాక హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ గ్లామర్ కి తోడు సోనాల్ చౌహన్ స్పెషల్ క్యారెక్టర్, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా F3 ట్రైలర్ ఫుల్ ఫన్ తో జనాలను అట్రాక్ట్ చేసింది. మరి F2కి సీక్వెల్ గా వచ్చిన F3 మూవీ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం!
ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో పాటు డబ్బును పెద్ద సమస్య. డబ్బుకోసం పరితపిస్తూ ఫ్యామిలీ కష్టాలను మోస్తున్న వెంకీ(వెంకటేష్)కి ఇంటినిండా అప్పులే. ఆల్రెడీ మంగ హోటల్ నడిపే హారిక(తమన్నా) ఫ్యామిలీ చేతిలో మోసపోయి ఎలాగైనా డబ్బు వసూల్ చేయాలనీ చూస్తుంటాడు. ఈ క్రమంలో అనాధ అయిన వరుణ్ యాదవ్(వరుణ్ తేజ్).. రిచ్ అని చెప్పుకుంటూ తిరిగే హనీ(మెహరీన్)ని చూసి ఇష్టపడతాడు. ఆమెను ఇంప్రెస్స్ చేసుకునే క్రమంలో వెంకీ సాయంతో పాలబేబీ(అలీ) దగ్గర లక్షల్లో అప్పు చేస్తాడు. తీరా పెళ్లి టైంలో ఆమె రిచ్ కాదని తెలుస్తుంది. మోసపోయి అప్పు వసూల్ చేద్దామని ట్రై చేయగా.. ఓ షాకింగ్ ట్విస్టు తెలుస్తుంది. అలాగే దొంగతనం చేసిన డబ్బు పోగొట్టుకొని చావు వరకు వెళ్లి.. చివరి క్షణంలో ఓ గుడ్ న్యూస్ తెలిసి విజయనగరం వెళ్తారు. మరి వెంకీ – వరుణ్ – హారిక – హనీ ఏం చేశారు? అప్పుల నుండి ఎలా బయటపడ్డారు? వారి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఎలాంటి సందేశం ఇచ్చారు? అనేది తెరపైనే చూడాలి.
ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలలో పెద్దగా స్టోరీస్ ఉండటం లేదు. కేవలం నాన్ స్టాప్ కామెడీ అనే లాజిక్ తో సినిమాలు తీస్తున్నారు. హిట్స్ కొడుతున్నారు. ముఖ్యంగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, మనీ అనే మూడు అంశాల చుట్టూ అల్లుకున్న ఎఫ్3 మూవీ.. ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యిందని చెప్పవచ్చు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది కాబట్టి.. సినిమాలో బలమైన కథ కంటే.. మంచి కామెడీ సీక్వెన్స్ లతో సినిమాను నడిపించారు. ఇలాంటి సినిమాలలో కథ పండిందా అనేదానికంటే.. సీన్స్, క్యారెక్టర్స్, కామెడీ, మాటలు ఆకట్టుకున్నాయా లేదా అనేది ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. ఈ విషయంలో F3 మూవీని బాగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.లాజిక్స్ పక్కన పెడితే F2 ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే.. సీక్వెల్ F3ని కూడా అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నట్లు అర్థమవుతుంది. సినిమాలో స్టార్ కాస్ట్ చాలా ఉంది. దాదాపు అన్నీ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఈ సినిమాలో కూడా మధ్య తరగతి మనుషులు.. కారు, బంగ్లా, లగ్జరీని పొందడానికి.. డబ్బు కోసం పరిగెత్తడాన్నే చూపించడం రొటీన్ గా అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో డబ్బు మీద మోజు, అది లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఇదివరకు చాలా సినిమాల్లో చూసాం. మళ్లీ అలాంటి కథకే.. పూర్తి కామెడీని యాడ్ చేసి తెరకెక్కించిందే F3.
డబ్బు చుట్టూ జనాల ఎలా పరిగెడతారో చూపిస్తూ ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ ఓ పెద్ద ట్విస్టుతో చావడానికి సిద్ధం అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలు పరిచయాలు.. డబ్బుకోసం ఆ పాత్రలు పడే వెంపర్లాట. చాలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్టు తర్వాత సెకండ్ హాఫ్ లో అదే డబ్బు పిచ్చిలో జనాలు ఎక్కడికైనా వెళ్తారు అనేది చూపించారు. సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అన్నీ ఫన్ లో భాగమే కావడం సినిమాలో విశేషం.మధ్యతరగతి పాత్రలలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా జీవించేసారు. సినిమాలో కమెడియన్స్ రఘుబాబు, సునీల్ లకు చాలారోజుల తర్వాత మంచి పాత్రలు లభించాయి. అలాగే నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎస్సై నాగరాజ్ పాత్రలో, వెన్నెల కిషోర్ పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ ఎస్సెట్. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ లో మెరిసిన ప్రగతి, అంతేగా ప్రదీప్, సత్య, అన్నపూర్ణ, వై విజయ, తదితరులు పర్వాలేదనిపించారు. కానీ అన్నపూర్ణ, వై విజయ డైలాగ్స్ యూత్ కి కొంచం ఓవర్ గా అనిపించవచ్చు. సినిమాలో మెహరీన్ కి చెప్పుకోదగ్గ పాత్ర కాదు. తమన్నా మాత్రం చాలా వేరియేషన్స్ తో సర్ప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డే సాంగ్ బాగుంది. కానీ ఆ సాంగ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది.
అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ పవర్ ని బాగా యూస్ చేసుకున్నాడు. వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి నత్తి డిఫెక్ట్స్ గా పెట్టి యాక్టింగ్ తో పాటు మంచి కామెడీ రాబట్టగలిగాడు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్, తమన్నా చెలరేగిపోయారనే చెప్పాలి. అయితే.. కామెడీ అన్నాక లాజిక్స్ లేని సీన్స్ కనిపిస్తాయి. కానీ నవ్విస్తూ ఆ లాజిక్స్ ని మరిపించే ప్రయత్నం చేశాడు అనిల్. క్లైమాక్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోల ఎంట్రీ ఎపిసోడ్ అదిరిపోయింది. మొత్తంగా F3 సినిమా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు. చివరిలో F2, F3లను కంటిన్యూ చేస్తూ F4 ఉంటుందని చెప్పేసాడు దర్శకుడు. ఇలా కామెడీని ప్రధానంగా చేసుకోని అయితే F4 వస్తే మంచిదే అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పరవాలేదనిపించాడు. కామెడీ సినిమా కదా మ్యూజిక్ ని అంతలా ఎక్సపెక్ట్ చేస్తే కష్టమే. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ బాగుంది. సెకండ్ హాఫ్ లెన్త్ ఎక్కువే అనిపించినా క్లైమాక్స్ తో ఆ ఫీల్ పోగొట్టడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ ప్రొడక్షన్ వేల్యూస్ హై లెవెల్ లో ఉన్నాయి. మరి మరోసారి దిల్ రాజు బ్యానర్లో పైసా వసూల్ సినిమా పడినట్లే.
చివరిమాట: డబ్బు చుట్టూ తిరిగే ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్.. F3!
రేటింగ్: 2.75/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!