30 వెడ్స్ 21.. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సీజన్ అంతటి బిగ్గెస్ట్ హిట్ సాధించిన తర్వాత.. సీజన్-2 కోసం అభిమానులు గట్టిగానే వెయిట్ చేశారు. పృథ్వి- మేఘన లాంటి లవ్లీ కపుల్ కు ప్రేమికుల దినోత్సవం సర్ ప్రైజ్ గా సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. మరి.., సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం రండి.
30 వెడ్స్ 21 సీజన్-2 విషయంలో ఈసారి సీజన్ కాన్సెప్ట్ మారచ్చేమో అని గతంలో కొన్ని పుకార్లు వినిపించాయి. కానీ సెకెండ్ సీజన్ ను సీక్వెల్ గానే ప్లాన్ చేశారు. ‘ఫస్ట్ యానివర్సరీ’ థీమ్ తో మొదటి ఎపిసోడ్ ను ప్రారంభించారు. ఓపెన్ షాట్ లోనే ‘పెళ్లికి పిలవని ఫ్రెండ్ కి పార్టీ’ అంటూ ఓ క్లాసిక్ ఫ్లేవర్ తో మాస్ బీట్ సాంగ్ ఇరగదీశారు. ఈ సారి కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఎంచుకున్నట్లు అనిపించింది. పెళ్లిరోజున కపుల్ మాల్ లో లాకైపోతే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెళ్లైన మొదటి సంవత్సరం మేఘనతో పృథ్వి- పృథ్వితో మేఘన పడ్డ కష్టాలేంటో కట్టె- కొట్టె- తెచ్చే కాన్సెప్ట్ లో చూపించేశారు. కంప్లైంట్ బాక్స్.. అని పెళ్లైన జంటలకు ఉపయోగ పడేలా ఒక కొత్త ఐడియా కూడా ఇచ్చారు. కార్తిక్- జెస్సీ కపుల్ ను కూడా ఎప్పటిలాగానే బాగానే వాడేశారు.
మొదటి ఎపిసోడ్ కాస్త కొత్తగా ట్రై చేసినా.. ప్రెజెంటేషన్ విషయంలో కాస్త లోటు కనపించింది. ఎక్కడో చిన్న స్పార్క్ మిస్ అయినట్లు అనిపించింది. కామెడీ, పంచ్ డైలాగుల విషయంలో రైటర్.. టైమింగ్ విషయంలో ఆర్టిస్టులు ఎక్కడా తగ్గలేదు. సీజన్-1కు కొనసాగింపు అనే ఫీలింగ్ రావడం కోసం కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను వాడుకున్నారు. కార్తిక్ సేమ్ ఓల్డ్ స్టైల్ లో కామెడీతో రెచ్చిపోయాడు. ‘అమ్మాయి ప్రేమను పొందడం గొప్ప కాదు.. అమ్మాయిని ప్రేమలో ఉంచడం గొప్ప’ అంటూ వెయిట్ ఉన్న డైలాగులు కూడా వేసేశాడు. జెస్సీ- మేఘన మధ్య సెంటిమెంట్ సీన్ ను బాగా పండించారు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ తమ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.