స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం తీసుకుంటారు. నాని కూడా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. తొలిసారిగా దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని భారీగానే పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది ఈ దసరా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవుతుండడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. రోజుకు సాధారణ షోస్ కంటే ఎక్కువ షోస్ పడేలా ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టడం ఖాయమని ఆశిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా కన్నడలో కూడా ఈ సినిమాపై భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా థియేట్రికల్ రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ భారీ ధరకు దసరా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ విషయంలోనే కాదు, ఓటీటీ రైట్స్ విషయంలో కూడా సినిమా రికార్డులు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. నాని కెరీర్ లోనే అత్యధిక ధరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. హిందీ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ ఏకంగా పావు గంట పైనే ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం నాని రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని ఒక సినిమాకి 10 కోట్ల లోపు పారితోషికం తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాకి మాత్రం రెట్టింపు పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా గనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే పారితోషికం పెంచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా చాటారు. ఇప్పుడు నాని వంతు వచ్చింది. మరి నాని కూడా అదే స్థాయిలో సత్తా చాటాలని కోరుకుందాం.