పవన్ కల్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంత మంది అభిమానులు ఉండటం కొన్ని సందర్భాల్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో చాలాసార్లు రుజువైంది. తాజాగా మరో సంఘటన ఆ విషయానికి అద్దం పడుతోంది. అఖిరా పుట్టినరోజు సందర్భంగా రేణూ దేశాయ్ పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ కి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాపులతోనే లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్న రికార్డు పవన్ కల్యాణ్ సొంతం. అలాగే నటుడిగా కంటే వ్యక్తిగానే పవన్ కు అభిమానులు ఎక్కువగా ఉంటారు. చాలామంది తాము అభిమానులు కాదు.. భక్తులని చెప్పుకుంటారు. ఈ అభిమానం హద్దులు దాటి సమస్యలు ఎదురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వేరే నటులు, సొంత కుటుంబసభ్యులు, స్వయంగా పవన్ కల్యాణ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అఖిరా పుట్టినరోజున పవన్ కల్యాణ్ అభిమానులపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 8న పవన్ కల్యాణ్– రేణూ దేశాయ్ కుమారుడు అఖిరా నందన్ పుట్టినరోజు. సెప్టెంబర్ 2న ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయో.. ఏప్రిల్ 8ని కూడా పవన్ అభిమానులు అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. అఖిరా పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న రేణూ దేశాయ్ ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది. “మేడమ్ ఇది చాలా అన్యాయం, మా అఖిరాని ఒక్కసారైనా చూపించండి. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు. మీరు అలా హైడ్ చేయకండి. అప్పుడప్పుడైనా వీడియోస్ లో అఖిరా బాబుని చూపించండి” అంటూ పవన్ అభిమాని రాసుకొచ్చాడు. ఈ విషయంపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభిమాని అడిగిన ప్రశ్నకు రేణూ దేశాయ్ స్పందించారు. “మీ అన్న కొడుకు??? అఖిరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హాడ్ కోర్ ఫ్యాన్స్ అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను సాధ్యమైనంత వరకు ఇలాంటి మెసేజెస్ ని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. కానీ, కొందరు మాత్రం మరీ అర్థం చేసుకోకుండా, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు” అంటూ రేణూ దేశాయ్ పవన్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. “నేను ఇలాంటి మెసేజెస్ ని ఇగ్నోర్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నాను. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. ఇలాంటి మెసేజ్ చదివి నాకు బాగా బాధేసింది” అంటూ కామెంట్ చేశారు.