ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలు విని రేణు దేశాయ్ ఏడ్చేశారట. ఆమె ఎవరో తెలియదు గానీ తన మాటలు విన్నాక కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే..!
ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించే వారు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు ఆమె పరిచయమయ్యారు. ఆ మూవీ బంపర్ హిట్టవ్వడంతో రేణు దేశాయ్‌కు టాలీవుడ్ ఆడియెన్స్‌లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె ‘జానీ’ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారు. ఈ సినిమా సమయంలో పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో 2009లో రేణు-పవన్ వివాహం చేసుకున్నారు. కానీ వీరి ప్రేమ చాన్నాళ్లు కొనసాగలేదు. పెళ్లైన రెండేళ్లకే రేణు-పవన్‌లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటనకు దూరమయ్యారు రేణు దేశాయ్. చాన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు రేణు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ పవన్ కల్యాణ్ అభిమానిపై ఆమె మండిపడ్డ సంగతి విదితమే. అకీరాను మా అన్న కొడుకు అని ఒక పవన్ ఫ్యాన్ సంబోధించడంతో రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. ‘అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడటం నేర్చుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు రేణు. ఇదిలా ఉంటే.. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాలో మరో పోస్ట్ పెట్టారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఓ సామాజికవేత్త మాట్లాడిన వీడియోను ఆమె షేర్ చేశారు. ‘నాకు ఈ వీడియోను ఒకరు పంపారు. ఆమె ఎవరో నిజంగా తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరఫున మాట్లాడటం విని చాలా ఏడ్చా’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
‘నేనేదైనా చెబితే ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయానని అంటారు. ఎన్నికలు వస్తున్నాయని కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా బాధను అర్థం చేసుకునేవారు ఉన్నారనే ధైర్యం వచ్చింది. ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది’ అని రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. కాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ మాట్లాడుతూ.. హీరో, హీరోయిన్లు విడితే హీరో గురించి ఎవరూ మాట్లాడరని.. హీరోయిన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారని చెప్పారు. సమాజం వీళ్ల (స్త్రీల) దగ్గర నుంచే రెస్పాన్సిబిలిటీని కోరుకుంటోందని.. వీళ్ల దగ్గర నుంచే జవాబుదారీతనాన్ని కోరుకుంటోందని వీడియోలో మహిళ చెప్పడాన్ని చూడొచ్చు. ‘రేణు దేశాయ్‌కు సమాజం నుంచి సహానుభూతి కావాలి. ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు’ అని వీడియోలో మహిళ పేర్కొన్నారు.