తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వీరికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. సినిమాల విషయంలో ఎవరి స్టైల్ వారిదే. ఈ ముగ్గురు అన్ని రకాల సినిమాల చేసినా.. వారిదైన ఒక ప్రత్యేక ముద్ర వేశారు. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్.. జానపద, లవర్‌బాయ్ తరహా పాత్రలు అంటే నాగేశ్వరరావు.. ఇక ప్రయోగాలు, యాక్షన్ హీరో, జేమ్స్‌బాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణ. అయితే వీరిలో అక్కినేని నాగేశ్వరరావు కేవలం సినిమాలకే పరిమితం అయితే.. ఎన్టీఆర్, కృష్ణ మాత్రం రాజకీయాల్లోను రాణించారు.
అందుకే నటనాపరంగా, రాజకీయపరంగా ఎన్టీఆర్, కృష్ణ మధ్య పలు సందర్భాల్లో అభిప్రాయ భేదాలు తెర మీదకు వచ్చాయి. కానీ అవన్ని తాత్కలికమే. విభేదాలు వచ్చిన ప్రతిసారి వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. కడవరకు.. కృష్ణ-ఎన్టీఆర్‌ల మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగింది. అయితే వారి మధ్య విభేదాలు వచ్చిన సందర్భాలు ఏవంటే..
కృష్ణ సినిమాల్లోకి రావాలి అనుకోవడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. అప్పటికే ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఎందరికో ఆయన అభిమాన నటుడు. ఆ కోవలోకి సూపర్ స్టార్ కృష్ణ కూడా చేరతారు. కృష్ణపై అధిక ప్రభావం చూపిన ఎన్టీఆర్ సినిమా పాతాళభైరవి. కృష్ణ ఈ సినిమాను తెనాలి రత్నా టాకీస్‌లో చూశాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌పైనున్న అభిమానం మరింత పెరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలను మాత్రం ప్రత్యేకంగా చూసేవాడు కృష్ణ. అలా ఎన్టీఆర్ ప్రభావంతో సినిమాల్లోకి వచ్చాడు కృష్ణ.
సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో ఉన్న కృష్ణ.. తన 19వ ఏట మద్రాస్ వెళ్లాడు. అప్పుడు ఆయన తొలుత కలిసింది తన అభిమాన హీరో ఎన్టీఆర్‌నే. ఆ సమయంలో ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమా తీస్తున్నారు. ఈ క్రమంలో విజయా సంస్థల అధినేత చక్రపాణి.. కృష్ణను తీసుకువెళ్లి ఎన్టీఆర్‌కు పరిచయం చేశాడు. మీ అభిమాని.. సినిమాల్లో రాణిద్దామనుకుంటున్నాడు అని తెలిపారు. అందుకు ఎన్టీఆర్ కృష్ణను ఉద్దేశించి.. బ్రదర్ మీకు 19 ఏళ్లు అంటే చాలా చిన్న వయసు.. మరో రెండేళ్లు నాటకాల్లో రాణించి.. ఆ తర్వాత సినిమాల్లోకి రండి అని సూచించాడు.
ఆతర్వాత కృష్ణ హీరోగా సినిమాల్లో రాణించాడు. అయితే తన అభిమాన హీరోతో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న కృష్ణకు స్త్రీజన్మ సినిమాతో ఆ అవకాశం లభించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించడంతో ఆయన్ని అన్నగారు అని పిలవడం అలవాటైంది కృష్ణకు. స్త్రీజన్మ సినిమా నిర్మాణ సమయంలో కృష్ణ పద్దతులు నచ్చడంతో.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన నిలువు దోపిడి చిత్రంలో తన తమ్ముడి పాత్రకు కృష్ణను రికమెండ్ చేశాడు ఎన్టీఆర్. అప్పటి నుంచి వారి మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
ఎన్టీఆర్-కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మరోక సూపర్ హిట్ చిత్రం.. దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే దేవుడు చేసిన మనుషులు 100 రోజుల ఫంక్షన్‌కి ఎన్టీఆర్ రాలేదు. అందుకు కారణం ఏంటంటే.. అప్పటికే ఎన్టీఆర్.. పౌరాణిక, సాంఘీక, జానపద, కమర్షియల్ చిత్రాల్లో నటించారు. కానీ ఆయన మనసులో ఓ కోరిక అలానే ఉండిపోయింది. అదేంటంటే.. అల్లూరి సీతారామారాజు సినిమా. తనే హీరోగా ఈ సినిమా తీయాలని భావించి.. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు ఎన్టీఆర్.
కానీ ఉన్నట్లుండి తాను అల్లూరి సీతారామారాజు చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు కృష్ణ. ఈ విషయంలో ఎన్టీఆర్‌కు కృష్ణ మీద తొలిసారి కోపం వచ్చింది. దాంతో ఆయన దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల ఫంక్షన్‌కి హాజరుకాలేదు.
అలాగే మరో సినిమా విషయంలో కూడా ఈ ఇద్దరి హీరోల మధ్య వివాదం తలెత్తింది. ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ సినిమా తీసే సమయంలోనే కృష్ణ కూడా కురుక్షేత్రం సినిమా తెరకెక్కించాడు. ఇద్దరి మధ్య ఓ ఆరు నెలల పాటు మాటలు లేవు. ఆ తర్వాత విభేదాలు ముగిసి.. ఇద్దరు కలిసి ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ చిత్రంలో నటించారు. అలా వారి మధ్య విభేదాలు ముగింపుకు వచ్చి.. మునపటి అనుబంధం తెర మీదకు వచ్చింది.
కొన్నేళ్ల పాటు కృష్ణ-ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం కొనసాగింది. అయితే ఈ ఇద్దరు హీరోలను తమ వారసులకు సంబంధించి ఓ సినిమా టైటిల్ కోసం గొడవపడ్డారు. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గొడవ సద్దుమణిగింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలకు దూరం అయ్యి.. రాజకీయాల మీద ఫోకస్ చేశారు. అప్పడు కృష్ణ.. ఎన్టీఆర్‌కు తన పూర్తి మద్దతు తెలిపాడు. అయితే అనూహ్యంగా కృష్ణ కూడా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ వ్యతిరేక వర్గం కాంగ్రెస్‌లో చేరారు కృష్ణ. రాజీవ్ గాంధీ చేసిన విన్నపం మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఏలూరు నుంచి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించాడు. అయితే రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ.. ఎన్నటీఆర్‌కు మళ్లీ చేరువయ్యాడు. వారిద్దరి మధ్య ఒకనాటి అనదమ్ముల అనుబంధం తిరిగి కొనసాగింది. ఆ తర్వాత నుంచి వారి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఎన్టీఆర్ మరణించే వరకు కూడా కృష్ణకు, ఆయనకు మంచి సంబంధాలుండేవి. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును కూడా కృష్ణ అందుకొన్నాడు.
ఇలా వీరద్దరి మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయాలకన్నా.. తమ అనుబంధం గొప్పది అని ఎప్పటికప్పుడు చాటుకున్నారు కృష్ణ-ఎన్టీఆర్. నాటి తరం నటుల్లోఒకడైన కృష్ణ నవంబర్ 15న మంగళవారం తుది శ్వాస విడిచారు. దాంతో అప్పట్లో వారి మధ్య నడిచిన చిన్న చిన్న విభేదాలు, వారి అనుబంధం మరో తెర మీదకు వచ్చింది.