టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రముఖ దిగ్గజ నటుడు ఘట్టమనేని కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జనరల్ చెకప్ కోసమే ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక, సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కారణంగానే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కృష్ణను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.
సాధారణంగా ఓ వయసు రాగానే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ప్రస్తుతం కృష్ణ వయసు దాదాపు 80 సంవత్సరాలు. ఈ వయసులో శ్వాస సంబంధ సమస్యలు రావటం సర్వ సాధారణం. వయసు పైబడే కొద్దీ క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వస్తే ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బందిగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో నాసికా రంధ్రాలు చిన్నవిగా మారిపోతాయి. ఊపిరితిత్తుల్లోని కొన్ని భాగాలు పాడవుతాయి. శ్వాస మార్గాలను కఫం మూసేస్తుంది. శ్వాస కోశ పొరలు ఉబ్బటం, వాపు రావటం వంటివి జరుగుతాయి. కాగా, టాలీవుడ్ చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు కృష్ణ.
దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో.. కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాల్లో హీరోగా నటించటంలోనూ రికార్డులను సృష్టించారు. ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాల్లో నటించి, విడుదల చేశారు. నిర్మాతగా కూడా ఎన్నో హిట్టులతో పాటు బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి విజయ నిర్మల మరణంతో తీవ్రంగా కృంగిపోయారు. ఆ బాధనుంచి కోలుకోకముందే మొదటి భార్య ఇందిరా దేవి కూడా కాలం చేశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఇందిరా దేవి మరణం తర్వాతినుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.