ఇప్పుడు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల హడావుడి నడుస్తోంది. మొన్నటి మొన్న నాగశౌర్య ఓ ఇంటి వాడు కాగా, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్లలో ఒకరైన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మరో యువ నటుడు వరుణ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తండ్రి నాగబాబు చెప్పారు. అలాగే అభిమానులు ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ పెళ్లి త్వరలోనే అంటూ ఓ కబురు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కేవలం హీరోలే కాదండీ హీరోయిన్లు కూడా పెళ్లి బాట పట్టారు. మహేష్ బాబు, రామ్ చరణ్ లతో ఆడి పాడిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో రేపో, మాపో ఏడడుగులు వేయబోతున్నారు.
ఈ పెళ్లి సీజన్ లో నే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు నటి శియా గౌతమ్. రవితేజ, పూరీ సినిమాల్లో ఒకటైన నేనింతేలో ఆమె హీరోయిన్ గా నటించారు. సోమవారం ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె భర్త పేరు నికిల్ పాల్కేవాలా. ఆమె వివాహానికి ప్రియమణి, ఆమె భర్త, మరికొంత మంది నటీనటులు హాజరయి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సంగీత్, మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలను శియా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఆమె వివాహ వార్త తెలిసిన నెటిజన్లంతా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
శియా అసలు పేరు అదితి గౌతమ్. నేనింతే సినిమాతో శియా గౌతమ్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాతో శియా గౌతమ్ కు అంత పేరు రాలేదు. తర్వాత వేదంలో ఓ చిన్న పాత్ర పోషించారు. అనంతరం బాలీవుడ్ కు వెళ్లిన ఆమె సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంజు సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో 11 ఏళ్ల తర్వాత గోపిచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో ఓ మంచి పాత్రలో కనిపించారు. హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు అయ్యాక తమ సినీ కెరీర్ ను సక్సెస్ గా కొనసాగిస్తున్నారు. మరీ శియా కూడా ఆ బాటలోనే నడుస్తారేమో వేచి చూడాలి. ఆమె పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగించాలని మీరూ భావిస్తే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.