మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మా సభ్యులు మద్య హూరా హూరీ యుద్దం కొనసాగుతుంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దర్శకుడు, నటుడు రవి బాబు కూడా మా ఎన్నికలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
నేను లోకల్ నాన్ లోకల్ విషయం మాట్లాడటం లేదు.. ఈ ప్యానల్ కు ఓటెయ్యండి ఆ ప్యానల్ కు ఓటెయ్యండి అని కూడా చెప్పను.. మన సినిమా వాళ్ళు బయటనుంచి ఆర్టిస్ట్ లను తీసుకువచ్చి మన సినిమాల్లో పెడుతున్నారు. వారి డిమాండ్లకు ఒప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అది వాళ్ల ఇష్టం.. మనకు సంబంధం లేదు. హైదరాబాద్‌లో దాదాపు 200 మంది కెమెరామెన్లకు పని లేదని ఆయన చెప్పారు. బయట నుంచి తెచ్చుకున్న కెమెరా మాన్లు ఔట్ డోర్ షూటింగ్స్ కి సంబంధించిన బిల్లులు చూసి నిర్మాతలు భయపడిపోతున్నారని ఆయన అన్నారు. చివరికి మేకప్ మ్యాన్, హెయిర్ డ్రస్సర్ లను కూడా బయటనుంచి తీసుకువస్తున్నారు. వారి డిమాండ్స్ అన్నింటికి ఒప్పుకుంటున్నారు. ఇలా ఒక్కటేమిటి.. సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. మన కోసం మనం పెట్టుకున్నాం సంస్థ ఇది.. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు రవిబాబు. కాగా, ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి మాట్లాడను అంటూనే ఇన్‌డైరెక్ట్‌గా తన అభిప్రాయాలను బయటపెట్టారు రవి బాబు.