తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు, నటుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడిగా పన్నెండు వందలకు పైగా చిత్రాలలో నటించి.. పలు సినిమాలను నిర్మించిన చలపతిరావుకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటగా విలన్ పాత్రలతో ఎనలేని పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చలపతిరావు.. చివరి రోజుల వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. ఇటీవల 78 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
ఇక చలపతిరావు మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విషాద వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ.. నివాళులు అర్పించారు. అయితే.. నేడు మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన డిసెంబర్ 24న కన్నుమూయగా.. అమెరికాలో ఉన్న ఆయన కుమార్తెలు రావడం ఆలస్యం కావడంతో ఆయన పార్థీవదేహాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు. కాగా.. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను.. పలువురు చలపతిరావు అంత్యక్రియలలో పాల్గొన్నారు.
మహా ప్రస్థానంలో బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చలపతిరావు భౌతకకాయానికి కుమారుడు రవిబాబు, కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ రవిబాబు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చేశారు. రవిబాబుతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్, సినీ ప్రముఖులు సైతం అశ్రునివాళి అర్పించారు. ఇదిలా ఉండగా.. చలపతిరావుకి టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. విలనిజంతో పాటు ఎన్నో విభిన్న పాత్రలను ఆయన డైలాగ్ డెలివరీతో రక్తికట్టించారు. చలపతిరావుకి సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం. ఇప్పుడు ఆయన లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ లోను విషాదం నెలకొంది.