ఈ మధ్యకాలంలో టీవీ షోలతో పాటు ఓటిటి షోలు కూడా జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ‘ఆహా’ ప్లాట్ ఫామ్ వినూత్న ప్రోగ్రాంలతో విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్రా లాంటి షోలు సీజన్లవారీగా రన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆహాలో ఇటీవల ప్రారంభమైన డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ ఐకాన్’. ఈ షోని ఓంకార్ హోస్ట్ చేస్తుండగా.. నటి రమ్యకృష్ణ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యహరిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం అయిన ఈ షో.. ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటివరకు ఈ డాన్స్ ఐకాన్ షో 14 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే 15, 16వ ఎపిసోడ్ లకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్ లతో పాటు స్టేజిపై శేఖర్ మాస్టర్ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. అయితే.. ఈసారి ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్ రాశిఖన్నా రావడం విశేషం. అలాగే షోలో స్టేజిపై అందంగా రెండు స్టెప్పులేసి సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. రాశిఖన్నా ఎంట్రీతో డాన్స్ ఐకాన్ మరింత గ్రాండ్ గా మారినట్లు అనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక గతంలో ఇలాంటి డాన్స్ రియాలిటీ షోలు చాలానే నిర్వహించాడు ఓంకార్. ప్రస్తుతం ఈ డాన్స్ ఐకాన్ ని కూడా తన నిర్మాణం, దర్శకత్వంలోనే చేస్తున్నాడు. ఇక యాంకర్ శ్రీముఖి, యష్ మాస్టర్, నటి మోనాల్ గజ్జర్.. ముగ్గురు టీమ్ లీడర్స్ పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా.. రాశిఖన్నా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే కార్తీ సరసన ‘సర్దార్’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇలా అప్పుడప్పుడు టీవీ షోలు, ఓటిటి షోలలో సందడి చేయడం ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడైతే డాన్స్ ఐకాన్ ప్రోమోలో రాశి ఎంట్రీ వీడియో ట్రెండ్ అవుతోంది. రాశి ఫుల్ పెర్ఫార్మన్స్ చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.