కొన్నిసార్లు ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మరొక హీరోయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ హీరోయిన్ కంటే ముందు వేరే హీరోయిన్ కి అవకాశం వస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ చేసుకుంటారు. అనుష్క నటించిన అరుంధతి పాత్ర మమతా మోహన్ దాస్ మిస్ చేసుకున్నట్టే.. బాహుబలి సినిమాలో తమన్నా నటించిన అవంతిక పాత్ర కూడా రాశి ఖన్నా చేయాల్సిందట. కానీ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి ఒక మాట అన్నారట.
మనం సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రభావతి పాత్రలో క్యూట్ గా నటించి కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. గోపీచంద్, రామ్ పోతినేని, రవితేజ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నితిన్ వంటి స్టార్ల సరసన జతకట్టింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. రుద్ర, ఫర్జి వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటన ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తుంది.
ప్రస్తుతం రాశి ఖన్నా యోధ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో హవా సాగించాలని చూస్తుంది. నిజానికి మద్రాస్ కేఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఆ తరువాత తెలుగు సినిమాలకే పరిమితమైంది. మద్రాస్ కేఫ్ సినిమా అయిపోయాక బాహుబలి సినిమాకి సంబంధించి ఆడిషన్స్ కి వెళ్లిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
బాహుబలి సినిమాలో తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరుగుతుంది. ఆ ఆడిషన్ కి రమ్మని రాశి ఖన్నాను పిలిచారు. ఆ ఆడిషన్ కి రాశి ఖన్నా వెళ్తే.. రాజమౌళి చూసి చాలా క్యూట్ గా ఉందని అన్నారట. ఈ అమ్మాయి ఏదైనా లవ్ స్టోరీకి బాగా సెట్టవుతుందని, ఆ కథ వినమని చెప్పారట రాజమౌళి. నా స్నేహితుడొకడు మంచి ప్రేమకథపై వర్క్ చేస్తున్నాడు. ఒకసారి కథ విను. నీకు తప్పకుండా నచ్చుతుంది అని రాశి ఖన్నాతో అన్నారు.
అలా రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని రాశి ఖన్నా వెల్లడించింది. అయితే రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలని ఉందంటూ కామెంట్స్ చేసింది. మరి రాజమౌళి అవంతిక పాత్రకు రాశి ఖన్నాను రిజెక్ట్ చేసి ఊహలు గుసగుసలాడే సినిమాలో ప్రభావతి పాత్రకు రికమండ్ చేయడంపై మీ అభిప్రాయమేమిటి? ఒకవేళ రాశి ఖన్నా తమన్నా చేసిన అవంతిక పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్స్ చేయండి.