టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరిగా హ్యాండ్సమ్ హంక్ రానా-మిహీకకు పేరుంది. సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని తపనపడే మిహీక చేసిన ఒక పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..!
టాలీవుడ్లో వైవిధ్యమైన హీరోల్లో దగ్గుబాటి వారసుడు రానా ఒకరు. రెగ్యులర్ రూట్లో కాకుండా ఆయన తనదైన దారిలో ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను మలుచుకుంటున్నారు. అవసరమైతే విలన్ పాత్రలు చేయడానికీ ఆయన వెనుకాడట్లేదు. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటే చాలు.. నిడివి తక్కువగా ఉన్నా ఆయన పచ్చజెండా ఊపేస్తున్నారు. అందుకే ‘బాహుబలి’, ‘ఘాజీ’ లాంటి బంపర్ హిట్లను ఆయన అందుకున్నారు. ‘విరాటపర్వం’ చిత్రంతో ప్రేక్షకుల మనసులను మరోమారు గెలుచుకున్నారు రానా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఢీకొట్టే పాత్రలో మెప్పించి.. ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌లోనూ కీలక పాత్ర పోషించారు.
రానా నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు.. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అభిమానులు ఆశిస్తుంటారు. అందుకే రానా కూడా ఆచితూచి చిత్రాలను చేస్తూ ముందుకెళ్తున్నారు. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికీ అంతే ప్రాధాన్యత ఇస్తారు హ్యాండ్సమ్ హంక్ రానా. 2020లో తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నారాయన. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మిహీక.. తన భర్తతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్‌కు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిహీక గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మిహీక చేసిన పని తెలిసి ఆమెను కొనియాడుతున్నారు. ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో సంస్థతో కలసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్న మిహీక.. ఈ క్రమంలో మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని మిహీక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌లో కరెంట్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మహిళలు రాత్రి వేళల్లో తమ పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడకుండా ఎన్జీవోతో కలసి మిహీక ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో నెటిజన్స్ వీరిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.