సీనియర్ నటి రమాప్రభా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఏళ్ల తరబడి.. వందలాది చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించింది రమాప్రభ. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 1400 వందలకు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో తొలితరం హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. పాత చిత్రాల్లో రమాప్రభ-రాజబాబు జోడికి చాలా క్రేజ్ ఉండేది. నిమిషం తీరికలేనంతగా బిజీగా షూటింగుల్లో పాల్గొనేది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. ఎక్కువ చిత్రాల్లో నటిస్తూ.. హీరోయిన్లకు ధీటుగా ఆస్తులు సంపాదించింది రమాప్రభ.
ఇక అడిగినవారికి కాదనకుండా సాయం చేసేంది. కోట్ల ఆస్తులు సంపాదించిన రమాప్రభ చివరకు ఓ హీరోని నమ్మి.. దారుణంగా మోసపోయింది. చేతిలో చిల్లగవ్వ లేకుండా.. నడిరోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సాయం కోసం ఆయన ఇంటికి వెళ్లింది రమాప్రభ. రజనీ చేసిన సాయం చూసి ఆమె కంట తడి పెట్టుకుంది. ఆ వివరాలు..
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా చాలా మంది అభిమానులుంటారు. 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేయడం మాత్రమే కాక.. యంగ్ హీరోలను తలదన్నే రేంజ్‌లో పారితోషికం తీసుకుంటున్నాడు. రీల్ మీద ఎలా ఉన్నప్పటికి.. నిజ జీవితంలో మాత్రం రజనీకాంత్ ఎంతో నిరాడంబరుడు. ఆయన వేషధారణ, మాట్లాడే పద్దతి చూస్తే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలి అనే దానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచే రూపం అనిపించక మానదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్నప్పటికి.. ఈ స్టేజ్‌కు చేరడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటుకుని.. ఈ స్థాయికి చేరుకున్నారు. కష్టం విలువ తెలుసు కాబట్టే.. సాయం కోరి ఆయన ఇంటి వద్దకు ఎవరైనా వస్తే.. తప్పకుండా ఆదుకుంటారు. అలా సాయం పొందిన వారి జాబితాలో నటి రమాప్రభ కూడా ఉన్నారట.
ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు రమాప్రభ. ‘‘నా జీవితంలో ఓ వ్యక్తిని నమ్మి ఎంతో మోసపోయాను. ఆస్తులన్ని పొగొట్టుకుని.. కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఆ సమయంలో సాయం కోసం రజనీ కాంత్ ఇంటికి వెళ్లాను. ఏదో దారి ఖర్చులకు సరిపడా సాయం చేసినా చాలనుకున్నాను. నా పరిస్థితి చూసి.. రజనీకాంత్ ఎంతో బాధపడ్డారు. వెంటనే తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలు తీసి నాకు అందజేశారు. ఆ సమయంలో 40 వేలు అంటే ఎంతో గొప్ప. కానీ రజనీకాంత్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.. వెంటనే ఆ మొత్తం నాకు ఇచ్చేశారు. ఆ డబ్బుతో చాలా కష్టాలు తీరాయి. ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటాను’’ అన్నారు రమాప్రభ.