హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు శరత్ బాబు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ పరిశ్రమలో సుమారు 250పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం..
నటుడు శరత్ బాబు ఇక లేరన్న వార్త టాలీవుడ్ జీర్ణించుకోలేక పోతుంది. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలో సుమారు 250పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో నటించిన నటీనటులంతా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. సినిమా పరంగా వివాద రహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందరికీ కష్ట సుఖాలున్నట్లే శరత్ బాబుకు కూడా వ్యక్తిగత జీవితంలో వాటిని ఎదుర్కొన్నాడు. సీనియర్ నటి రమాప్రభతో వివాహం అప్పట్లో పెను సంచలనం.
అప్పటికే సినీ పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి, తన కంటే సుమారు ఐదేళ్లు పెద్దదైన రమాప్రభను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరిద్దరూ వివాహానికి ముందు అనేక సినిమాల్లో నటించారు. అయితే ఆ సమయంలోనే అప్పుడే ఎదుగుతున్న శరత్ బాబును రికమెండ్ చేసి మరీ సినిమా అవకాశాలు ఇప్పించేందని టాక్. అప్పుడే వీరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సాగింది. వీరికి పిల్లలు లేరు. కానీ మనస్పర్థలు వచ్చి అందరికీ షాక్‌నిస్తూ విడిపోయారు.
అయితే గతంలో శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను జీవితంలో మర్చిపోలేని రోజులు ఏంటని అడిగితే.. తన పుట్టిన రోజు ఒకటని, రెండు తన భార్య రమా ప్రభ పుట్టిన రోజు, మూడు తమ పెళ్లి రోజు అంటూ పత్రిక ఇంటర్య్వూలో చెప్పారు. చాన్నాళ్లు అన్యోన్యంగా సాగిన వీరి కాపురం.. అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు.