మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు మోస్ట్ ఫేవరేట్ గా వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ గా స్టార్డమ్ అందుకొని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. దేశవ్యాప్తంగా చరణ్ పేరు మార్మోగడానికి కారణం ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మరో కొత్త సునామీ ఇది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో మగధీర వచ్చి.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అదీగాక రాజమౌళి చేయి పడిందంటే చాలు.. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్టే.
అలాంటి రాజమౌళితో రామ్ చరణ్ చేసిన రెండో సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీ రికార్డులను తిరగేస్తూ విజయవంతంగా రన్ అవుతోంది. మార్చి 25న రిలీజైన ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్ కి.. అటు రాజమౌళి, ఇటు మెగా ఫ్యాన్స్ అందించిన బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అని చెప్పాలి.
సినీ అభిమానులకు రాంచరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి డెబ్యూ చేసిన చరణ్.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నాడు.
ఆ వెంటనే రాజమౌళితో మగధీర చేసి మొదటి ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు చెర్రీ ఖాతాలో చేరాయి. కాలభైరవగా, రొమాంటిక్ హీరోగా చరణ్ ప్రేక్షకులలో స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్నాడు. అయితే 2010లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆరెంజ్’ మూవీ నిరాశపరిచింది. కానీ ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
ఇక 2011లో రచ్చ, 2013లో నాయక్, 2014లో ఎవడు కమర్షియల్ హిట్స్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ సత్తా చాటాయి. ఇక 2013లో చరణ్.. తుఫాన్ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేశాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో చరణ్ అద్భుత నటన అందరినీ ఆకట్టుకుంది. 2015లో వచ్చిన ‘బ్రూస్ లీ’ నిరాశ పరిచినా.. ‘ధృవ’ మూవీతో చరణ్ అద్భుతంగా కంబ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత 2018లో సుకుమార్ తో చేసిన రంగస్థలం మూవీ కెరీర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటవిశ్వరూపం చూపించాడు. 2019.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘వినయ విధేయ రామ’ మళ్లీ నిరాశ పరిచింది. అయినా సరే సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేసి.. చివరికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేశాడు. ఈ సినిమా చరణ్ ఇమేజ్ ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించాడు. ఇక చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేశాడు.
రామరాజుగా చరణ్ యాక్టింగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్.. అభిమానులకు ఐ-ఫీస్ట్ గా మారింది. ప్రస్తుతం చరణ్.. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఇక హార్స్ రైడింగ్ ఇష్టపడే రాంచరణ్ కి ‘హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్’తో పాటు ట్రూజెట్ అనే సొంత ఎయిర్ లైన్స్ కూడా ఉంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. ఎల్లప్పుడూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. ఆయన విజయాలలో కీలకపాత్ర పోషిస్తోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా.. చరణ్ భార్యగా.. అపోలో హాస్పిటల్స్ నిర్వహణలో కీలకపాత్రధారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మరి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.