సుమారుగా 1,500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఇకలేరనే వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మాస్టర్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈమధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ టాలెంట్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సినీ ప్రముఖులు కానరాని దూరాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ఎంతో మంది చిత్రాలకు ఆయన పనిచేశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ మాస్టర్‌కు ఆదివారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. కానీ ట్రీట్మెంట్ పొందుతూనే రాకేష్ మాస్టర్ ప్రాణాలు వదిలారు. రాకేష్ మాస్టర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు.
రాకేష్ మాస్టర్ గత జ్ఞాపకాలను ఫ్యాన్స్ నెమరువేసుకుంటున్నారు. ఇకపోతే, తన అనుకున్న వాళ్లందరూ చనిపోవడంతో లైఫ్‌పై విరక్తి కలిగిందని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా తమ్ముడు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇల్లు, బట్టలు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. మట్టిలో కలసిపోవడమే పర్మినెంట్’ అని ఆ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అంతేగాక తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియో తీశామని తెలిపారు. ‘నా మామ (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్క నాటా. దీన్ని పెంచతా. చనిపోయిన తర్వాత నన్ను ఈ వేప చెట్టు కిందే సమాధి చేయాలి’ అని రాకేష్ మాస్టర్ కోరారు. తన చివరి కోరిక ఇదేనంటూ రాకేష్ మాస్టర్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.