సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల అంకం తుది దశకు చేరింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు ఇలా సాధారణ ఎన్నికల స్టంట్ ని తలపించాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఈ రోజు సాయంత్రం రిజల్ట్ రాబోతుంది. మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు తో పాటు ఆయన ప్యానెల్ సభ్యులు, మోహన్ బాబు ఉదయాన్నే చేరుకోగా.. కాసేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. రాగానే వెంటనే మోహన్ బాబు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రకాశ్ రాజ్. కొద్ది సేపు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకున్నారు.
ఈ సన్నివేశం చూడటంతో అక్కడ అంతా ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 883 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఓటు వేయడానికి ఎంత మంది వస్తారో చూడాలి. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తికానుండగా ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.