ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో తెలుగులోకి డబ్ అయింది. రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పేటా వంటి సినిమాలతో తన స్థాయికి తగ్గ హిట్ అందుకోలేకపోయిన సూపర్‌స్టార్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు.
కథ..
తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వీరన్న పాత్రలో రజినీకాంత్ కనిపిస్తారు. ఆ ఊరికి పెద్ద మనిషిగా ఉండాడు. కీర్తి సురేష్ వీరన్న చెల్లెలుగా నటించింది. చెల్లెలంటే వీరన్నకు ప్రాణం. తన చెల్లికి ఏ చిన్న కష్టం వచ్చిన అన్న తట్టుకోలేడు. తన చెల్లి ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలన్నదే వీరన్న ఆశ. ఆనందంగా సాగిపోతున్న చెల్లిలి జీవితంలో అనుకోని కష్టాలు వస్తాయి. వాటి నుంచి తన చెల్లిని పెద్దన్నగా వీరన్న ఎలా రక్షించుకున్నాడు అన్నదే మిగతా కథ.
విశ్లేషణ..
వీరన్నగా రజినీకాంత్ నటన సినిమాకే హైలెట్. దర్శకుడు శివ తన మార్క్ యాక్షన్ సీన్లతో సినిమాను నడిపించాడు. చెల్లెలుగా కీర్తి సురేష్, విలన్‌గా జగపతిబాబు అద్భుతంగా నటించారు. ప్రకాశ్‌రాజ్, ఖుష్బు, మీనా, నయనతార తమ పాత్రల పరిధిమేరా మంచి నటన కనబర్చారు. కాగా ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుంది. కామెడీ సీన్లు, ఓవర్ సెంటిమెంట్ సీన్లు మరీ రొటిన్‌గా ఉన్నాయి. విలన్స్‌కు హీరోకు వచ్చే సీన్లు, రజినీ మాస్ సీన్లు మాత్రమే ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి.
ప్లస్‌పాయింట్లు..
రజినీకాంత్ నటన
మాస్ సీన్లు
కీర్తి సురేష్
మైనస్ పాయింట్లు..
రొటీన్ కథ
పేలని కామెడీ
ఓవర్ సెంటిమెంట్
అంతిమంగా: రజినీకాంత్ పెద్దన్న.. పెద్దగా మెప్పించలేదు
రేటింగ్: 2.5