సినీ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే పరుగులు పెడుతుంటారు. కానీ.., ఒక వయసు వచ్చేశాక అదే పరుగుని హుందాగా ఆపడం అనేది ఓ గొప్ప విషయం. నటభూషణుడు శోభన్ బాబు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అలాంటి ప్లాన్ లోనే ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాది భారతదేశంలో సినీ అభిమానులకు రజనీకాంత్ పేరు చెబితే చాలు.., అంతులేని అభిమానంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన స్టయిల్ ని ఆపాదించి, ఓ నూతన ఒరవడిని పృఫ్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎల్లలు లేని మాస్ పాపులారిటికి రజనీ నిలువెత్తు నిదర్శనం. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఊహించని అపూర్వ స్థానాన్ని కైవశం చేసుకున్న రజనీకాంత్ జీవితం పూలపాన్పులా ప్రారంభం కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు… మరెన్నో ఎత్తుపల్లాలు…అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసమే రజనీని ఇన్నాళ్లు చేయి పట్టుకుని నడిపించింది. పట్టుదల, కృషి ఉంటే మనిషి అధిరోహించలేని శిఖరాలు ఉండనే ఉండవు అనే జీవితసత్యానికి రజనీకాంతే సజీవ నిదర్శనం. అందుకే రజనీకాంత్ కోటానుకోట్లమందికి ఆరాధ్యదైవమయ్యారు. స్ఫూర్తిదాయకమయ్యారు.
రజనీకాంత్ పలు మాస్ క్యారెక్టర్స్ ద్వారా మాస్ ఆడియన్స్ గుండెల్లోకి, స్లమ్స్ లోని పూరిగుడిసెల్లోకి చొచ్చుకుపోయారు. రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు తమిళనాట మొత్తం సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఈనాటికీ ఇందులో ఎలాంటి మార్పు రాలేదు. 1980ల నాటికి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ అగ్రశ్రేణి నటుడిగా ప్రాచుర్యం పొందాడు. అమితాబ్ నటించిన డాన్ రీమేక్ ‘బిల్లా’ చిత్రం రజనీని ఫుల్ లెంత్ యాక్షన్ హీరోగా బాక్పాఫీసు సాక్షిగా నిరూపించి, సరికొత్తచరిత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలు బిల్లా చిత్రమే రజనీ కెరీర్లో అతిపెద్ద బాక్సాఫీసు హిట్ గా రికార్డు నెలకొల్పింది. కానీ 1990 తర్వాత మాత్రం బాషా ప్రభంజనం మొదలయింది. అది ఓ కొత్త అవతారం. రజనీకాంత్ విశ్వరూపం. అప్పట్లో రజని ప్రతీ చిత్రం ఓ పెద్ద సంచలనం.. అన్నిటికీ కామన్ పాయింట్ వసూళ్ళ పెనుతుఫాను మాత్రమే. ఇక 2010 సంవత్సరం మొత్తం భారతీయ చిత్రపరిశ్రమకే ఒక మేలుకొలుపు. అది రికార్డ్స్ కి ఊహించలేని కుదుపు. రజనీకాంత్ ని దర్శకుడు శంకర్ ఎవ్వరూ అందుకోలేని సమున్నతశిఖరాలపైన నిలబెట్టాలనే శ్రద్ధతో తీసిన రోబో ఎల్లలు లేని విజయాన్ని దక్కించుకుంది. అత్యంత ఖరీదైన నిర్మాణవిలువలతో తెరకెక్కిన రోబో ఇండియన్ సినిమా హిస్టరీలో కనివిని ఎరుగని కలెక్షన్స్ రాబట్టింది.
ఇక గడిచిన నాలుగేళ్లలో ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రజనీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీని విడుదలకు ముస్తాబు చేశాడు. ‘సిరుత్తై’ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. కోవిడ్ టైములోనూ పలు జాగ్రత్తలతో ఈ చిత్రాన్ని పూర్తిచేశారు. ఇక.. ఈ సినిమా షూటింగ్ చివరి రోజున రజనీకాంత్ తన రిటైర్మెంట్ కు సంబంధించిన విషయాలను చిత్రబృందంతో పంచుకున్నారట. ఆ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిలు, తన ఆరోగ్యం అన్నీ సహకరిస్తే.. ఇంకొక రెండు సినిమాలు చేయాలనుందని.. అయితే.., భగవంతుడు దయ ఉంటే అది నెరవేరుతుందని, లేకపోతే తాను రిటైర్ అవ్వబోతున్నానని ‘అన్నాత్తే’ యూనిట్ సమక్షంలో వెల్లడించారట రజనీ. ఆరోగ్య కారణాల రీత్యానే ఆమధ్య రాజకీయాలను కూడా దూరం పెట్టారు సూపర్ స్టార్. మొత్తానికి.. ఏడుపదుల వయసులోనూ సూపర్ స్టార్ గా.., దూసుకుపోతున్న రజనీకాంత్ రిటైర్మెంట్ అనేది సినీ ఇండస్ట్రీలో పెను సంచలనమే. మరి.. రజనీకాంత్ రిటైర్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఆయన సినిమాలను నుండి వెంటనే రిటైర్ కావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.