తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ నటుడు శరత్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌళిలోని ఏఐజి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. గచ్చిబౌళిలోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా నిన్న శరత్ బాబు తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
తెలుగు ఇండస్ట్రీలో తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు శరత్ బాబు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారని సహనటులు అంటుంటారు. హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన ఆయన పలు భాషల్లో దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా ఆయన నరేష్, పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లి పెళ్లి’ మూవీలో కనిపించారు. శరత్ బాబు మరణంతో సినీ లోకం కంటతడి పెట్టుకుంది. నిన్న సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదారాబాద్ లోని ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు. రాత్రి ఆయన భౌతికదేహాన్ని చెన్నైకు తరలించారు. చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు ఇండస్ట్రీయల్ శ్మశాన వాటికలో జరిగాయి. చెన్నైలో భౌతికకాయానికి పలువురు కోలీవుడ్ నటీనటులు వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్.. శరత్ బాబుతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ శరత్ బాబు కి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసిన రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ ఓ మంచి స్టార్ ని కోల్పోయింది.. శరత్ బాబు చాలా మంచి మనిషి.. ఆయనలో ఎప్పుడూ నేను కోపాన్ని చూడలేదు. నా పట్ల ఎంతో అప్యాయతతో ఉండేవారు. మేం ఇద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. ముత్తు, అన్నామలై, వేలైక్కారన్ ఇలా పలు చిత్రాల్లో కలిసి నటించాం.. అవి సూపర్ హిట్ గా నిలిచాయి. శరత్ బాబు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. నాకు సిగరెట్లు బాగా కాల్చే అలవాటు.. నేను ఎప్పుడు సిగరెట్ తాగుతున్నా నోట్లో నుంచి లాగి అవతల పడేసేవాడు. ఎక్కువ సిగరెట్స్ కాల్చితే ఆరోగ్యానికి ప్రమాదం అని సున్నితంగా హెచ్చరించేవాడు. నేను ఎప్పుడైనా టెన్షన్ కి లోనై సరిగా నటించకుంటే పక్కన కూర్చొని భుజం తట్టి నన్ను ప్రోత్సహించేవాడు. మా మద్య ఎన్నో ఎళ్లుగా స్నేహబంధం కొనసాగుతూ వస్తుంది’ ఆయన మృతి తట్టుకోలేకపోతున్నా అంటూ ఎమోషన్ కి గురయ్యాడు.