విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివారలు..
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు.. శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ పోరంకిలోని అనుమలు గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రసంగిస్తూ.. బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి హీరోలు చేయలేని సాహసాన్ని బాలయ్య చేశారన్నాడు. అంతేకాక వేదిక మీదుగా ప్రసంగిస్తూనే.. బాలయ్యకు కోపమేక్కువ.. కంటి చూపుతోనే చంపేస్తాడంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘కంటి చూపుతో చంపేస్తా.. ఒక తన్ను తంతే జీపు 30 అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది.. సినిమాల్లో ఇలాంటి పనులు చేసింది రజినీకాంత్ కాదు, అమితాబ్ కాదు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కానే కాదు. ఈ సీన్లు, డైలాగ్‌లో మేం ఎవరం చేసినా జనం ఒప్పుకోరు. కానీ బాలయ్య చేస్తే మాత్రం ఒప్పుకుంటారు.. అభిమానంతో ఊగిపోతారు. ఎందుకంటే తెలుగు ప్రజలు బాలయ్యను బాలయ్యలా చూడలేదు. మహానుభావుడు ఎన్టీఆర్‌ను బాలయ్యలో చూసుకున్నారు తెలుగు ప్రజలు. ఆ ఎన్టీఆర్ యుగపురుషుడు ఏమైనా చేయగలరు కదా. అలానే బాలయ్య కూడా అన్నీ చేస్తాడు. కాకపోతే చాలా కోపిష్టి.. కానీ పాల లాంటి మనసు’’ అంటూ బాలయ్య గురించి రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అలానే చంద్రబాబు నాయుడి మీద కూడా ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. ‘‘వేదిక మీద చంద్రబాబు నాయుడు ఉంటే.. రాజకీయాల గురించి తప్పకుండా ప్రస్తావించాలి. విజన్ 2020 గురించి ఆయన 1996, 1997 టైమ్‌లోనే నాతో చెప్పారు. ఆసమయంలోనే చంద్రబాబు ఐటీ ప్రాధాన్యతను గుర్తించారు. దానిలో భాగంగానే హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారు. నేడు లక్షల మంది తెలుగు ప్రజలు ఐటీలో పనిచేస్తూ లగ్జరీగా బతుకుతున్నారంటే అందుకు చంద్రబాబు నాయుడే కారణం’’ అంటూ ప్రశంసలు కురిపించారు.
‘‘ఇక ‘జైలర్’ షూటింగ్ సందర్భంగా ఈ మధ్యే నేను హైదరాబాద్‌లో రాత్రి వేళ జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లాను. అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే.. నేను ఇండియాలో ఉన్నానా.. న్యూయార్క్‌లో ఉన్నానా.. అనే విషయం అర్థం కాలేదు. ఆ పరిసరాలు అంతలా మారిపోయాయి. హైదరాబాద్ ఎకనామికల్‌గా కూడా అభివృద్ధి సాధించిందని విన్నాను. మాన్యశ్రీ చంద్రశేఖర్ రావు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు 2047 గురించి ప్రణాళికలు రచిస్తున్నారు. వాటిని అమలు చేస్తే.. ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు దేవుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రజినీకాంత్. ఈ వీడియో వైరలవుతోంది. మరి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.