‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తొలిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. రాజా రవీంద్ర ప్రయాణంలో మనం గమనించాల్సినవి రెండే ప్రశ్నలు. ఒకటి అతడ్ని హాట్ సీట్ మీదకు తీసుకొచ్చిన ప్రశ్న. రెండు అతనికి కోటి రూపాయాలు తెచ్చిపెట్టిన ప్రశ్న. మరి ఆ ప్రశ్నలు ఏంటి వాటికి ఏం సమాధానం చెప్పాడో చూద్దాం.
ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్..
హాట్ సీట్‌లోకి రావాలంటే మొదట ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి?
A న్యూయార్క్
B ముంబయి
C దుబాయి
D విజయవాడ
ఈ ప్రశ్నకు కేవలం 2.63 సెకన్లలోనే సమాధానం చెప్పి రాజా రవీంద్ర హాట్ సీట్ మీదకు వచ్చాడు. ఆ తర్వాత మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు అందుకున్నాడు.
కోటి రూపాయల ప్రశ్న..
1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు.. ఎవరు అధ్యక్షత వహించారు?
A రంగనాథ్ మిశ్రా
B రంజిత్ సింగ్ సర్కారియా
C బీపీ మండల్
D ఫజల్ అలీ కమిషన్
రాజా రవీంద్రకు సమాధానం తెలిసినా.. కాస్త అనుమానం ఉంది. అప్పటికే ఉన్న లైఫ్ లైన్లలో రూ.12.5 లక్షల ప్రశ్నకు, రూ.50 లక్షల ప్రశ్నకు రెండు లైఫ్ లైన్లు ఉపయోగించారు. రిస్క్ తీసుకోకుండా మిగిలిన మూడో లైఫ్ లైన్ ను కూడా ఉపయోగించుకుని రాజా రవీంద్ర కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఆప్షన్ D ఫజల్ అలీ కమిషన్. ఆ సమాధానంలో మీలో ఎవరు కోటీశ్వరుడు హిస్టరీలోనే కోటి రూపాయలు గెలిచిన తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు.