నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై.. తమ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ఆ పాటలో భాగస్వామ్యం అవ్వడంపై రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ స్థాయికి వెళ్లడం గర్వంగా ఉందని అన్నారు.
నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. ఒక తెలుగు సినిమా పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం పట్ల పలువురు సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక నాటు పాట, మన తెలుగు పాట ఆస్కార్ స్థాయికి వెళ్లడం అనేది చాలా గగనం. గట్టిగా మాట్లాడితే జాతీయ అవార్డులకే దిక్కు లేదు తెలుగు సినిమాలకు. తెలుగు సినిమాకి గుర్తింపు లేదని 16 ఏళ్ల క్రితం చిరంజీవి మొత్తుకున్నారు. మన దేశంలోనే తెలుగు భాష అన్నా, తెలుగు సినిమా అన్నా, తెలుగు నటులన్నా గుర్తింపు లేదని ఆవేదన వెల్లడించారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగు సినిమా అంటే భారతీయ సినిమా అనే స్థాయికి ఎదిగింది. ఆ క్రెడిట్ రాజమౌళిదే అని చెప్పాలి.
ఇక ఈ పాటకి అంతర్జాతీయంగా ఇంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం సంగీతాన్ని అందించిన కీరవాణి, దానికి సాహిత్యం కూర్చిన చంద్రబోస్, గొంతు కలిపిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు విజువల్ గా దానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఈ పాటకు అవార్డు రావడంలో భాగమైనందుకు ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీలవుతున్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తల్లిదండ్రులు అయితే పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఇందులో తమ కొడుకు భాగస్వామ్యం అవ్వడం పట్ల రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం చాలా చాలా సంతోషంగా ఉందని, తమ బిడ్డ అంతర్జాతీయ వేదిక మీద పాడడం అంటే మాటల్లో చెప్పలేనని, అది దేవుడి దయ, అదృష్టంగా భావిస్తున్నానని రాహుల్ తల్లి అన్నారు.
కీరవాణి, వల్లి, రాజమౌళి, రమా రాజమౌళికి కృతజ్ఞతలు, రాహుల్ ఈ పాట పాడడం, ఆస్కార్ స్థాయికి వెళ్లడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నానని రాహుల్ తల్లి అన్నారు. ఇక రాహుల్ తండ్రి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని, ఆస్కార్ వరకూ వెళ్తానని రాహుల్ కూడా కలగనలేదని, అక్కడి వరకూ వెళ్లి ఆస్కార్ అనేది తీసుకోవడం మాకు చాలా పెద్ద బహుమతి అని అన్నారు. రాహుల్ ని మొత్తం ప్రపంచం గుర్తుపట్టే విధంగా అయిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా రాహుల్ సిప్లిగంజ్ కి గుర్తింపు వచ్చిందని, చాలా సంతోషంగా ఉందని రాహుల్ తండ్రి అన్నారు. మరి రాహుల్ పాడిన పాటకు ఆస్కార్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న రాహుల్ తల్లిదండ్రులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.