సినీ ప్రపంచంలో అన్నీ కల్పితాలే. కథాకథనాల నుండి భావోద్వేగాలు, హావభావాల వరకు అన్నీ కల్పించినవే. సాధారణంగా సినిమా స్టార్టింగ్ ముందే ‘పాత్రలన్నీ కేవలం కల్పితాలే’ అని చెబుతుంటారు. కానీ.. తీరా సినిమాలోకి వెళ్ళాక అన్నీ నిజంగానే జరుగుతున్నాయేమో అనిపించేలా చేస్తుంటారు మేకర్స్. సినిమాలోని ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, నేపథ్యం.. ఆ వాతావరణం ప్రేక్షకులను ఆ మూడ్ లోకి తీసుకెళ్ళిపోతాయి. అంతటి మాయ వెనుక గ్రాఫిక్స్ వర్క్ ఎంతో ఉంటుందనే విషయం తెలిసిందే.
ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. దర్శకులు ఊహించి రాసుకున్న దృశ్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ టీమ్ పడే కష్టం అంతా ఇంతా కాదు. సినిమాలో అద్భుతమైన లొకేషన్స్, సన్నివేశాలు.. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందంటే.. అది కేవలం సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) వల్లే సాధ్యమవుతుంది. అయితే.. ఈ ఏడాది విడుదలైన పాన్ ఇండియా పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్‘ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా.. సాంగ్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా బాగుందని అనిపించినా.. సినిమాలో ప్రధానంగా కథాకథనాలు, లాజిక్స్ లోపించి సినిమా ప్లాప్ లిస్టులో చేరింది. అందులోనూ ఈ సినిమా ఊహించని బడ్జెట్ తో తెరకెక్కడం మైనస్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించారు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విజువల్స్, మ్యూజిక్ మాత్రమే ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ మొదటిసారి కలుసుకునే ట్రైన్ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇటలీ నేపథ్యంలో రాసుకున్న ట్రైన్ సీక్వెన్స్.. ట్రైలర్, సాంగ్స్ నుండే అట్రాక్ట్ చేసింది. అయితే.. రన్నింగ్ ట్రైన్ లో హీరో హీరోయిన్ ని చున్నీతో లాగే సీన్ చూడటానికి ఎంతో అందంగా అనిపిస్తుంది. కానీ.. ఆ సీన్ ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసిన విధానం మనం మేకింగ్ వీడియోలో చూడవచ్చు. రన్నింగ్ ట్రైన్ లో డోర్ వద్ద నిలబడితే ఎవరికైనా వేగమైన గాలికి జుట్టు ఎగరడం మామూలే.
ఇక్కడ సీన్ తీసింది గ్రీన్ మ్యాట్ లో కాబట్టి.. పూజా హెగ్డే అలా గాల్లో ఎగురుతున్నట్లు కనిపించడానికి ఓ అబ్బాయి ఫ్యాన్ పట్టుకొని నిలబడటం మేకింగ్ వీడియోలో ఉంది. ఆ తర్వాత సీన్ లోకి ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అలా ఈ ట్రైన్ సీన్ ని తెరకెక్కించి.. థియేటర్స్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస టీమ్. దీంతో ఇప్పుడు ఈ రాధే శ్యామ్ మేకింగ్ వీడియో చూసిన నెటిజన్స్.. సరదాగా ఎంత మాయచేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాధే శ్యామ్ సినిమా మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.