R Narayana Murthy: తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. కెరీర్ మొదటినుంచి సామాజిక బాధ్యత ఉన్న అంశాలనే ఆయన తన కథాంశంగా మలుచుకుంటున్నారు. కష్టం, నష్టం వచ్చినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సామాజిక బాధ్యతే తన ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నో అవార్డులు సైతం ఆయన్ని వరించాయి. తాజాగా, ఆర్ నారాయణ మూర్తిని వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. తనకు ఈ అవార్డు రావటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు..
వైఎస్ రాజశేఖరరెడ్డిగారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి, నాకు.. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు ఇవ్వటం అనేది.. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత 38 ఏళ్లుగా భారత దేశంలో గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో గానీ, ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో.. దానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు. దానికి కళాకారుడ్ని నేను ఎలా స్పందిస్తున్నా.. ఏం పరిష్కారం చూపిస్తున్నా.. అలా తీసుకుంటూ వస్తున్నా.. ప్రజలు బ్రహ్మాండంగా దయతలుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సామాజిక సమస్యల ఇతి వృత్తాలతో ఆర్ నారాయణమూర్తి ప్రజా చిత్రాలు తీస్తున్నాడు. అని నన్ను ఆశీర్వదిస్తున్నారు.
నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రకంగా మన్ముందుకు సాగుతోంది నా ప్రయాణం. ఈ దశలో నా కృషా, నా స్వార్థమా.. నా తపనా.. నా పిచ్చా.. మీరు ఏమన్నా అనుకోండి. నేను చేసినా పనా.. ఏమన్నా అనుకున్నా సరే మంచి చిత్రాలు తీస్తున్నాడు నారాయణ మూర్తి.. ప్రజా చిత్రాలు తీస్తున్నాడు ఆర్ నారాయణ మూర్తి. అని ప్రజలు గుండెల్లో పెట్టుకుని దయదల్చుతున్నారో.. ఆ ప్రజా చిత్రాలు తీస్తున్నందుకు.. ఆ ప్రజల దయ వల్ల.. ఈ వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు నన్ను గుర్తించి, గౌరవిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. థాంక్యూ అండి’’ అని అన్నారు.