అలనాటి మేటి తార, టాలీవుడ్ సత్యభామ జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వయోభార సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. జమున మృతిపై సీఎం జగన్, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తమ సంతాపం తెలిపారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి జమున భౌతిక దేహానికి నివాళులు అర్పించారు.
ప్రముఖ విప్లవ సినిమాల దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా జమున పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆమె భౌతిక దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమున తెలుగు చిత్ర పరిశ్రమ రారాణి. సూపర్ స్టార్. గొప్ప నటీమణి. మానవీయ కోణం ఉన్న మంచి మనిషి. గ్రేట్ పొలిటిషియన్. జమున గారి మరణం ఇవాళ ప్రపంచానికి కూడా తీరని లోటు. ఆమె భారత భాషలన్నింటిలో నటించటం మాత్రమే కాదు.. నటించి మెప్పించారు. శభాష్ అనిపించుకున్నారు.
ఆమె ఎంపీ కూడా అయ్యారు. నాటక రంగమా సినిమా రంగమా అని కాకుండా.. సినీ వృద్ధ కార్మికులకు ప్రభుత్వాన్ని రికమెండ్ చేసి ఫించన్లు ఇప్పించారు. అనేక రంగాల్లో ఆమె సేవలు నభూతో న భవిష్యత్. కాబట్టి.. నేను మనస్పూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. మహాతల్లి అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిపించండి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ కానీ, పద్మ విభూషణ్ కానీ ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు. మరి, అలనాటి మేటి తార, టాలీవుడ్ సత్యభామ జమున మరణంపై ఆర్ నారాయణ మూర్తి ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.