ఈ సినిమాలో తిండి విషయంలో కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ అనిపించేలా నటించిన నటుడు తర్వాత దర్శక నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లోనూ తను నమ్మిన సిద్ధాంతాలతోనే చిత్రాలు తీస్తూ.. తనకు నచ్చినట్టుగానే లైఫ్ లీడ్ చేస్తున్నారాయన.
ఈ జనరేషన్ వాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన, ఆలోచింపజేసే చిత్రాలున్నాయి. కళాత్మకమైనవి, కళాఖండాలుగా నిలిచిపోయినవి, అజరామరమైన చలనచిత్రాలకు తెలుగు పరిశ్రమ పెట్టింది పేరు. ఆనాటి కొన్ని సినిమాల్లోని సీన్లు ఇప్పుడు చూసినా బోర్ కొట్టవు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయే మూవీస్, సీన్స్ చాలానే ఉన్నాయి. ఓటీటీ మాధ్యమాలు ఎన్ని వచ్చినా కానీ యూట్యూబ్ దారే వేరు. బ్లాక్ వైట్ నుండి ఇప్పటి వరకు ఏ సినిమా, సీన్, సాంగ్ కావాలన్నా మాగ్జిమమ్ దొరికేస్తాయి. ఇక పలు సామాజిక మాధ్యమాలలో ఆ సీన్స్ ఎంతలా చక్కర్లు కొడతాయో తెలిసిందే. సినిమాలకు, ప్రేక్షకులకు మధ్య వారధిలా నిలిచిన యూట్యూబ్‌లో టీజర్, ట్రైలర్స్, సాంగ్స్, సీన్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఓ ఆకట్టుకునే సన్నివేశం ఒకటి తెగ వైరల్ అవుతుంది. అది కూడా ‘పీపుల్స్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి నటించిన సినిమాలోనిది కావడం విశేషం. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన చిత్రమది.
ఆర్. నారాయణ మూర్తి అనగానే విప్లవాత్మకమైన సినిమాలు గుర్తొస్తాయి. సమాజంలో జరిగే సంఘటనలనే కథలుగా తీసుకుని, తన చిత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుంటారు. స్నేహ చిత్ర పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి కథ, స్క్రీన్‌ప్లే, పాటల రచన, సంగీతం, నిర్మాత, దర్శకుడిగా పలు విభిన్న భూమికలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర సినిమాల్లో అవకాశాలిచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకు నచ్చిన సినిమాలే చేస్తూ.. తనకు నచ్చిన మార్గంలోనే పయనించే మూర్తి, స్వర్గీయ దాసరి నారాయణ రావు గారి శిష్యుడు. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉన్న నారాయణ మూర్తి మద్రాసు వెళ్లిన తర్వాత దాసరి పరిచయం తర్వాత మళ్లీ ఊరెళ్లి BA కంప్లీట్ చేసి తిరిగి చెన్నపట్నం వచ్చి సినీ ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. అప్పటికే తాను తీసిన కొన్ని చిత్రాల్లో చిన్నా చితకా వేషాలిచ్చిన దాసరి ‘సంగీత’ సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడి పాత్ర ఇచ్చారు. నిర్మలమ్మ కొడుకు నారాయణ క్యారెక్టర్లో తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు నారాయణ మూర్తి.
మురళీమోహన్, సిల్క్ స్మిత తదితరులు నటించిన ఈ మూవీలో మూర్తి రోల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రకు ఆకలి ఎక్కువ. ఒక్కసారి తినడం స్టార్ట్ చేశాడంటే.. వండిన ఫుడ్ అయిపోవాల్సిందే కానీ ఇక చాలు అనే మాట అనడు. ‘సంగీత’ మూవీలో మూర్తి భోజన ప్రియుడు అనడం కంటే, ఆయన భోజనం కుంభకర్ణుడి ఆకలికి ఏ మాత్రం తీసిపోదు. అలా మూర్తి ఫుల్లుగా ఫుడ్ లాగించే సీన్లతో చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. భోజనం హోటల్‌కి వెళ్లి తింటుండగా అతని తిండి చూసి బెదిరిపోయిన హోటల్ యజమాని మూర్తి డబ్బులు తిరిగిచ్చేసి, బయటకు పంపేస్తాడు. దెబ్బకి ఫుల్ మీల్స్ బదులు ప్లేట్ మీల్స్ మాత్రమే పెట్టబడును అని బోర్డు పెడతారు. మరో సన్నివేశంలో ఎవరిదో పిలవని పేరంటానికి వెళ్లి ఫుల్లుగా ఆరగించేస్తాడు. దెబ్బకి అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ఇక ఇంట్లో తల్లి భోజనం వడ్డించినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆమె తిందో లేదో కూడా అడక్కుండా మొత్తం లాగించేస్తాడు. అతడిని పోషించలేక పిల్లలు లేని వాళ్లకి దత్తత ఇచ్చేద్దామనుకుంటుంది నిర్మలమ్మ. ‘సంగీత’ లో మధ్య తరగతి జీవన విధానంతో పాటు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.