సినిమా అంటే ఓ మాయా ప్రపంచం. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి ప్రేక్షకులను మాయ చేసి, వాళ్ళని వేరే లోకంలోకి తీసుకెళ్లడమే సినిమా అంటే. అయితే.. గతకొంత కాలంగా సినిమాలలో గ్రాఫిక్స్ వర్క్ బాగా పెరిగిపోయింది. లొకేషన్స్, బ్యాగ్రౌండ్ గ్రీనరీ కోసం, కథలోని రిస్కీ షాట్స్ కోసం, గ్రాండియర్ లుక్ కోసం అంతా గ్రాఫిక్స్ వర్క్ నే నమ్ముకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాల్లో సీజి వర్క్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ పాన్ ఇండియాలో లెవల్లో సూపర్ హిట్ అయిన పుష్పలో కూడా సీజి వర్క్ చాలానే ఉంది.
పుష్ప కథ అంతా ఫారెస్ట్ చుట్టూ.. ఎర్రచంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి.. దర్శకుడు సుకుమార్ టీమ్ కి సీజీ వర్క్ తప్పలేదు. అదీగాక పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్లాన్ చేసినప్పుడు ఎంతటి రిస్కీ సీన్స్ అయినా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి సన్నివేశాలు థియేటర్లో చూస్తే.. ఎంత థ్రిల్ అవుతామో.. వాటి మేకింగ్ వీడియోలు చూస్తే అంతే షాక్ అవ్వకతప్పదు. తాజాగా పుష్ప మూవీకి సంబంధించి ఓ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది.
ఆ వీడియోలో ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ గ్రీనరీ కోసమే గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్ ని ఉపయోగించినట్లు తెలుస్తుంది. అయితే.. మేకింగ్ అంతా బాగానే ఉంది. అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అతని కష్టాన్ని వీడియోలో చూడవచ్చు. కానీ మేకింగ్ వీడియోలో ఓ టేక్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమాలో పోలీసులు చేజ్ చేస్తుండగా.. పుష్పరాజ్ ఎర్రచందనం లోడ్ లారీని తీసుకెళ్లి నిమిషాల్లో మాయం చేసి నడుచుకుంటూ పోలీసులకు ఎదురొచ్చే సీన్ ఒకటి ఉంటుంది.
ఆ సీన్ థియేటర్లో మొదటిసారి చూసినప్పుడు కలిగే ఫీల్ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. అల్లు అర్జున్ లారీలో నుండి బయటికి దూకి లారీని బావిలోకి వదిలేస్తాడు. అది మనకు సినిమాలో తర్వాత రివీల్ చేస్తారు. కానీ ఆ సీన్ మేకింగ్ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. లోడ్ లారీని బావిలోకి వదిలేసి దూకే మేకింగ్ సీన్ లో లారీనే లేకపోవడం గమనార్హం. కేవలం ఓ డోర్ లో నుండి బన్నీ బయటికి దూకడం మనం రియల్ మేకింగ్ లో చూడవచ్చు. ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. సుకుమార్ – అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న పుష్ప సీక్వెల్ పై ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక పుష్ప 2లో బన్నీ మేకోవర్ వేరే లెవెల్ లో ఉండబోతుందని సమాచారం. స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.