కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. సినీ ప్రముఖులు పునీత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలు.. వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు, విద్యార్థులను చదివించడం లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు.
ఆయన సమాజ సేవకుడు మాత్రమే కాదు.. ప్రకృతి ప్రేమికుడు. తాజాగా అప్పు ఎంతో ఇష్టపడి నటించిన ప్రకృతికి సంబంధించిన డాక్యుమెంటరీ టీజర్ సోమవారం రిలీజ్ అయింది. పునీత్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీకి ‘గంధడ గుడి’ అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం.
ఈ డాక్యుమెంటరీ కర్ణాటక అడవులు, సుందరమైన బీచ్‌లు , నదీనదాల అందాలను.. ప్రకృతిలోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్రనిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. ఈ ప్రాజెక్ట్ పునీత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. ఇక ఈ టీజర్ ప్రకృతి ప్రేమికులకు విజువల్ ట్రీట్‌ను ఇస్తుంది.