చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత తల్లావర్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. ఆయన తన 71వ ఏట సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తన ఆప్త మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేసిన సుందరం మాస్టారు.. తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న మాస్టారు శిష్యులు ఇంటికి చేరుకుని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాస్టారు మృతితో సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.
పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు, కుమార్తె రాగానే రేపు జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుందరం మాస్టారు 1950 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో జన్మించారు. బీఎస్సీ వరకు చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లోమా పూర్తి చేశారు. నాటకాల్లో హాస్యాన్ని జొప్పించి కొత్త దనాన్ని తీసుకువచ్చారు. హాస్య నాటికల ఆధ్యుడిగా పేరు గాంచారు.