ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్శ్‌కు ఆది మాత్రమే ఉంటుంది. అంతం ఉండదు. ఈ యూనివర్స్‌లో ఒక్కో గ్రహానికి ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్ ప్రకారం.. ఓ చోట ఎండ్ అయిపోయిన ఓ సూపర్ హీరో జీవితం.. మరో సూపర్ హీరో కథలో సజీవంగా ఉంటుంది.
కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఇలాంటి ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించబోతున్నారా?.. సౌత్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌కు తెరతీయబోతున్నారా?.. మార్వెల్ అద్భుత శక్తులున్న సూపర్ హీరోలతో ఓ ప్రపంచాన్ని సృష్టిస్తే.. ప్రశాంత్ నీల్ యాక్షన్ హీరోలతో కేజీఎఫ్ చుట్టూ కథ నడిచే ఓ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. తనకో కల ఉందని యాంకర్‌కు చెప్పాడు. ఆమె అదేంటని అడగ్గా.. ఆ కల నెరవేరిన తర్వాత మొదట ఆమెకే చెబుతానన్నాడు. గోప్యంగా ఉంచిన ఆ కల సౌత్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయటమే కావచ్చు. కేజీఎఫ్ చాప్టర్ 3 ఇందుకు బలం చేకూరుస్తోంది. కేజీఎఫ్ 2లో హీరో రాకీ షిప్పుల్లో బంగారంతో సముద్రంలో మునిగిపోతాడు. ఆ తర్వాత సీఐఏ రంగంలోకి దిగుతుంది. రాకీ ఓ ఇంటర్‌నేషనల్ క్రిమినల్ అని అప్పుడు తెలుస్తుంది.
అంటే.. కేజీఎఫ్ 3.. రాకీ చనిపోవటానికి ముందు జరిగిన సంఘటనలతో తెరకెక్కబోతోందన్న మాట. ఇది ప్రీక్వెల్.. ఈ సినిమాకు సీక్వెల్స్.. టైమ్ లైన్ సినిమాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సముద్రంలో మునిగిపోయిన రాకీ నిజంగా చనిపోయాడన్న క్లారిటీ లేదు. ఒక వేళ బతికి ఉంటే సీక్వెల్స్ పుట్టుకువచ్చే అవకాశం ఉంది. తాజాగా కేజీఎఫ్-3 గురించి ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ క్లారిటీ ఇచ్చారు.
కెజిఎఫ్: చాప్టర్ 1, కెజిఎఫ్: చాప్టర్ 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు కెజిఎఫ్: చాప్టర్ 3 ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో హీరో యష్ ‘KGF: చాప్టర్ 3’ గురించి మాట్లాడుతూ.. మొదటి రెండు భాగాలను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందని, డైరెక్టర్- ప్రొడ్యూసర్ కేజీఎఫ్ సిరీస్ ని ‘మార్వెల్ యూనివర్స్’గా ప్లాన్ చేస్తున్నారని.. ఇక ముందు భాగాలలో వేరే స్టార్ హీరోలు కూడా నటించే అవకాశం ఉందని తెలిపాడు.
ఈ విషయాలపై ఇప్పుడు KGF నిర్మాత విజయ్ కిర్గందూర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చాప్టర్ 3కి సంబంధించి అన్ని విషయాలలో క్లారిటీ ఇచ్చారు. అలాగే మార్వెల్ యూనివర్స్ లాగా కేజీఎఫ్ యూనివర్స్ కూడా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. కెజిఎఫ్: చాప్టర్ 3 ఎప్పుడు వస్తుంది? అందులో రాకీ భాయ్ పాత్ర కంటిన్యూ అవుతుందా లేదా? అని నిర్మాత విజయ్ ని అడిగినప్పుడు.. ‘ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లోపు సలార్ ని పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నాం. ఇప్పటికే ‘సలార్’ షూటింగ్ 30 నుంచి 35% పూర్తయింది. సలార్ పూర్తయిన వెంటనే.. అక్టోబర్ లేదా నవంబర్‌లో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కేజీఎఫ్-3 ని 2024లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీని ‘మార్వెల్ యూనివర్స్’లాగా చేయబోతున్నాం. ముందుముందు మరికొంత మంది స్టార్స్ ఈ సిరీస్ లో చేరనున్నారని విజయ్ చెప్పేసారు. అదేవిధంగా మిగతా సిరీస్ ల కోసం వివిధ సినిమాల్లోని ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. డాక్టర్ స్ట్రేంజ్, ‘స్పైడర్‌మ్యాన్: హోమ్‌కమింగ్’ లాంటి ప్రపంచాలను సృష్టించేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడని విజయ్ కిర్గందూర్ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ‘కెజిఎఫ్-3’లో మలుపులు, కొత్త పాత్రలు పుట్టుకొస్తాయో చూడాలి. కేజీఎఫ్-2 క్లైమాక్స్ లో కేజీఎఫ్-3 టైటిల్ చూసినప్పటి నుండి ఫ్యాన్స్ చాప్టర్-3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. సలార్ సినిమా కూడా గనుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతోంది. సలార్ సినిమాను కేజీఎఫ్‌తో కలిపే పాయింట్లు చాలానే ఉన్నాయి. సలార్ సినిమాను, కేజీఎఫ్ సినిమాను ఇంటర్ లింక్ చేయొచ్చు. ఒక వేళ రాకీ బతికి వస్తే ప్రబాస్, యశ్‌తో కలిపి ఓ కొత్త సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇద్దరు యాక్షన్ హీరోలను ఓ చోట చేర్చి.. ప్రేక్షకులకు యాక్షన్ ఫీస్టు ఇవ్వొచ్చు. టైమ్ లైన్‌ను బేస్ చేసుకుని మరికొన్ని సినిమాలను కేజీఎఫ్‌తో ఇంటర్ లింక్ చేయొచ్చు.
అంతేకాదు! ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తీయబోతున్న 31వ సినిమాను కూడా కేజీఎఫ్, సలార్ సినిమాలతో లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ సినిమా పేర్లు మారుతుంటాయి.. కానీ, టైమ్ లైన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక సినిమాలో హీరో అయిన వ్యక్తి మరో సినిమాలో మరికొందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. లేదా ఆ సినిమాలో కీ రోల్ పోషించొచ్చు. తాజాగా, ప్రశాంత్ నీల్ తమిళ స్టార్ హీరో దళపతిని కలిశారు. ఆయనతో సినిమా ఉంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. సౌత్‌లోని స్టార్ హీరోలందర్నీ కలిపి కేజీఎఫ్ యాక్షన్ వరల్డ్‌లోకి తీసుకువస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ భారత వెండి తెరపై చూడని అద్భుతాలను చూడొచ్చు. మరి, హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లాగా ప్రశాంత్ నీల్ సౌత్ హీరోలతో కేజీఎఫ్ చుట్టూ కథ నడిచే ఓ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.