తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల 19న తెలుగు నిర్మాతల మండలికి ఎన్నికలు జరగుతున్ననేపథ్యంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉందని, అదెప్పుడూ బాగుండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. టీఎఫ్పీసీ కమిటీపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్పప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇద్దరు నిర్మాతలను వేటు వేసినట్లు చెప్పారు.
నిర్మాతలు కె. సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్ ను జీవిత కాలం మండలి నుండి బహిష్కరించినట్లు తెలిపారు. నిర్మాతల మండలికి ఎవరూ చెడ్డ పేరు తెచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలు జరగట్లేదని కొందరు రాద్దాంతం చేస్తున్నారన్నారు. వచ్చే నెల 19న నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతాయన్న ఆయన.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందన్నారు. 19న ఎన్నికలు నిర్వహించి, సాయంత్రం కౌంటింగ్ జరుపుతామన్నారు. అదే రోజు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
మా కౌన్సిల్ లో ప్రస్తుతం రూ. 9 కోట్ల ఫండ్ ఉందని, ఇంతా డబ్బు పోగవ్వడానికి దాసరి నారాయణ రావు సహాయ సహకారాలే కారణమన్నారు. తమకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని అన్నారు. కొందరు పదవులు కోసం కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని, అవేవీ టీఎఫ్పీసీలో భాగం కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా నంది, సింహ అవార్డులను ప్రదానం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. వారు ఇవ్వకుంటే.. ఆ అవార్డులను తామే ఇస్తామని వెల్లడించారు.