బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటన, అందానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
బాలీవుడ్ హీరోయిన్లలో విపరీతమైన క్రేజ్ ఉన్నవారిలో ఒకరు ప్రియాంకా చోప్రా. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేలా గ్లామర్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు పిగ్గీ చాప్స్. అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ పోతున్నారామె. పెళ్లైన తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేయడం తగ్గించిన ఈ అందాల రాశి.. హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రాను ఆమె తండ్రి అశోక్ చోప్రా చాలా క్రమశిక్షణతో వ్యవహరించమని చెప్పేవారట. ఈ విషయంతో పాటు బాల్యంలో జరిగిన ఒక ఆసక్తికర ఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.
‘చదువుకునేందుకు 12 ఏళ్ల వయసులో నాన్న నన్ను యూఎస్‌కు పంపారు. దీంతో అక్కడి కల్చర్, ఫుడ్ నాకు అలవాటయ్యాయి. అయితే నా జుట్టు బాగా ఊడిపోయింది. అలాగే నా ఆహార్యం కూడా మారిపోయింది. చదువు ముగిసిన నాలుగేళ్ల అనంతరం భారత్‌కు తిరిగొచ్చా. మేం ఉన్న నగరంలోని ఒక స్కూలులో చేర్పించారు. పాఠశాల నుంచి తిరిగి వచ్చే టైమ్‌లో కొంతమంది అబ్బాయిలు నా వెంట పడుతూ మా ఇంటి వరకు వచ్చేవారు. ఒక రోజు రాత్రి ఒక అబ్బాయి మా ఇంటి బాల్కనీలోకి దూకాడు. దీంతో నేను అరుస్తూ నాన్న వద్దకు పరిగెత్తా. ఆయన నా రూమ్ కిటికీని క్లోజ్ చేశారు. అంతే కాకుండా కొన్ని రూల్స్ పెట్టారు. అమెరికాలో ఉన్నట్లు ఇక్కడ ఉంటే అస్సలు కుదరదన్నారు. క్రమశిక్షణతో ఉండాలని సూచించారు’ అని ప్రియాంక తన అభిమానులతో పంచుకున్నారు.