సోషల్ మీడియాలో తాను విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి అన్నారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్స్ అభ్యంతరకరంగా దూషిస్తూ కామెంట్స్ చేశారన్నారు.
టాలెంట్ కలిగిన వాళ్లు ఎక్కడ ఉన్నా వారిని చేరదీయడంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముందంజలో ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు కూడా పరభాషకు చెందిన ప్రతిభావంతులను ఆదరిస్తుంటారు. అందుకే ఇతర రాష్ట్రాలు, భాషలకు చెందిన ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ టాలీవుడ్లో రాణిస్తున్నారు. అలా ఇక్కడ క్రేజ్ సంపాదించిన వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు. కేరళకు చెందిన ఆమె.. తెలుగు చిత్రాల ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించారు. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో టాలీవుడ్లో ఫస్ట్ హిట్ కొట్టిన ప్రియమణి.. ‘యమదొంగ’, ‘కింగ్’, ‘గోలీమార్’ సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించారు. ఈమధ్య కాలంలో వెంకటేష్ ‘నారప్ప’, నాగచైతన్య ‘కస్టడీ’లోనూ మెరిశారామె. ప్రస్తుతం హిందీలో ‘మైదాన్’, ‘జవాన్’ సినిమాలు చేస్తున్నారు ప్రియమణి. ఇవి హిట్టయితే బాలీవుడ్ నుంచి ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అలాంటి ప్రియమణి తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో తాను ఆన్లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. బాడీ షేమింగ్, స్కిన్ టోన్ విషయంలో ఇప్పటికీ తాను విమర్శలు ఎదుర్కొంటున్నానని ప్రియమణి చెప్పుకొచ్చారు. ముస్తఫాను ప్రేమించి పెళ్లాడినప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకతను ఫేస్ చేశానని పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ తనను కొందరు తిట్టారన్నారు. ‘నాపై కామెంట్స్ చేసేవాళ్లకు నేను చెప్పేది ఒకటే.. ఇది నా లైఫ్. ఎవరితో ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది పూర్తిగా నా ఇష్టం’ అని ప్రియమణి స్పష్టం చేశారు. ట్రోల్స్ వల్ల బాధపడటం తనకు నచ్చదని.. అందుకే విమర్శలను పట్టించుకోనని ఆమె వివరించారు.