ఆసాంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్‌రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడు కాకపోవడం వల్లే తనను ఓడించారనే అర్థం వచ్చేలా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక తెలుగు బిడ్డను మా ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు, దాన్ని ఆమోదించాలని కోరుతూ వాట్సప్ మెసేజ్ చేశారు.
దానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట విష్ణు గెలుపుపై ఆయనకు కంగ్రాట్స్ చెప్తు.. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ మెసేజ్‌లో పేర్కొన్నారు. తన అవసరం ఉంది అనుకుంటే బయటి వ్యక్తిగా ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటానని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. కాగా దీనికి విష్ణు రిప్లే ఇస్తూ ప్రకాశ్‌రాజ్ నిర్ణయంతో తాను సంతోషంగా లేనని అన్నారు. గెలుపోటములు అనేవి నాణేనికి రెండు వైపులని అన్నారు. మీరు మా కుటుంబంలో భాగమని అన్నారు. మీ ఆలోచనలు నాకెంతో అవసరమని, కలిసి పనిచేద్దాం అని విష్ణు అన్నారు. త్వరలో ప్రకాశ్‌రాజ్‌తో కలుస్తానని, చర్చిద్దామని, అప్పటి వరకూ రిప్లే ఇవ్వద్దు అని విష్ణు ప్రకాశ్‌రాజ్‌కు పంపిన మెసేజ్‌కు ఇచ్చిన రిప్లేలో పేర్కొన్నారు.