గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ ఎన్నికలను మించి యుద్ద వాతావరణాన్ని సృష్టించింది. ఒకరిపై ఒకరు మాటల యుద్దం.. ఫిర్యాదుల వరకు వెళ్లింది. మొత్తానికి గత ఆదివారం మా ఎన్నికలు ముగిసాయి.. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికల్లో మోహన్‌బాబు రౌడీయిజం, బూతులను హైలైట్ చేస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖను రాశారు. ‘మా’ సభ్యులను తిట్టడం, బెదిరించడంతో పాటు భౌతిక దాడికి దిగారు. ఎన్నికల అధికారిగా మీకు ఉన్న విచక్షణా అధికారం కారణంగానే వారి అనుయాయులు పోలింగ్ ప్రాంతంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను. అసలు పోలింగ్ కేంద్రంలో అసలు ఏం జరిగిందనే విషయం ‘మా’ సభ్యులకు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
ఎన్నికల్లో జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ఇవ్వాలని కృష్ణమోహన్‌ను కోరారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో గతంలో తీర్పులు ఇచ్చి ఉందని, కచ్చితంగా మాకు సహకరిస్తారని భావిస్తున్నాను అంటూ లేఖలో రాశారు ప్రకాష్ రాజ్. ఇక సీసీ ఫుటేజ్ అడుగుతూ ప్రకాష్ రాజ్ రాసిన లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. సీసీ టీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.