డార్లింగ్ ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు వరకే పరిమితం కాదు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిథి మర్యాదలతో ఫిదా చేసే హీరోలలో ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రభాస్ చేసే అతిథి సత్కారాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ చెబుతుంటే వింటూ ఉన్నాం.
హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ ఎక్కడ జరిగినా.. సెట్ లో ప్రభాస్ ఉంటే మాత్రం చిత్ర బృందానికి పండగే అని అంటుంటారు. ఎందుకంటే.. తన సినిమాలో నటించే సెలబ్రిటీలకు ఇంతవరకు రుచి చూడని వెరైటీ వంటలతో మర్యాదలు చేస్తుంటాడు డార్లింగ్. ఇదివరకు సాహో షూటింగ్ సమయంలో కూడా హీరోయిన్ శ్రద్ధాకపూర్.. ప్రభాస్ ఏర్పాటుచేసే విందుకు ఫిదా అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా పలు మీడియా సమావేశాల్లో బయటపెట్టింది శ్రద్ధా.
ఇటీవల ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ కూడా ప్రభాస్ విందు మర్యాదలకు ఫిదా అయిపోయింది. అలాగే సాలార్ బ్యూటీ శృతిహాసన్ కూడా తన కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ చేసినట్లు.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి మరీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రభాస్ అందించే విందు సత్కారాలకు ఫిదా అయ్యే వంతు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి వచ్చింది.
ఇటీవలే ప్రభాస్ సరసన నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది దీపికా. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న దీపికాకు ప్రభాస్ అదిరే విందు భోజనం రుచి చూపించాడట. ఈ విషయాన్ని స్వయంగా దీపికా.. సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీలో.. 10కి పైగా వెరైటీ వంటకాల పిక్ షేర్ చేసింది. దీపికా ప్రభాస్ మర్యాదలకు ఫిదా అయిపోయిందట. ప్రస్తుతం దీపికా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.