డార్లింగ్ హీరో ప్రభాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దక్షిణాదిలోనే కాక.. నార్త్‌లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్ను మూశారు. పెదనాన్న మృతి నేపథ్యంలో ప్రభాస్ కొన్ని రోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండి.. కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించి మరోక ఆసక్తికర వార్త వైరలవుతోంది. అదేంటంటే..
త్వరలోనే ప్రభాస్ తన సొంతూరు మొగల్తూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో.. సెప్టెంబర్ 28న వారి స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభతో పాటు భారీ సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ సొంతూరు మొగల్తూరుకు వెళ్తారని సమాచారం. అంటే సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు వెళ్తున్నారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు 2010లో మరణించారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించగా.. దశదిన కార్యక్రమాలను మొగల్తూరులో చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు తన పెద్దనాన్న సంస్మరణ సభకు వెళ్లనున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. కృష్ణంరాజు ఫ్యామిలీ వస్తుండడంతో మొగల్తూరులోని వారి నివాసంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం మొగల్తూరులో ఉన్న వారి పూర్వీకుల నివాసానికి రంగులు వేయడంతోపాటు.. ఫర్నీచర్ కూడా మారుస్తున్నారు. 50 మంది కార్మికులతో పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయించాలని ప్రభాస్ ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ద్రాక్షారామం నుంచి ప్రత్యేకంగా వంటవాళ్లను రప్పించినట్లు తెలుస్తోంది.
గతంలో కృష్ణంరాజు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఏడాదికి కనీసం రెండుసార్లు తమ సొంతూరుకు వచ్చి వెళ్లే వారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మొగల్తూరుకు వెళ్లడానికి కుదరలేదు. ఈ నెల 11న తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ 23న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసంలో దశదిన కార్యక్రమం జరగనుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.