మన వరకు దేవుడు అంటే నెవ్వర్ ఎండింగ్ ఎమోషన్. ఇక దేవుడు, భక్తి ఆధారంగా రూపొందే సినిమాలు కరెక్ట్ గా తీయాలే గానీ రిలీజ్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర బాక్సులు బద్దలు కొడతాయి. ఆడియెన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ప్రభాస్ హీరోగా, రామాయణం బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. తాజాగా అయోధ్యలో రిలీజైన ఈ చిత్ర టీజర్.. యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. అంచనాలు కూడా పెంచేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇందులో ఒకటి యాక్షన్, మరొకటి లవ్ డ్రామా.. ఇప్పుడు ‘ఆదిపురుష్’లో శ్రీరాముడిగా భక్తి ప్లస్ యాక్షన్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి రానుంది. ఇకపోతే టీజర్ పై రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ.. ప్రభాస్ మాత్రం సినిమా గురించి, దాని కథ గురించి చాలా మంచి విషయాలు బయటపెట్టాడు.
‘రాముడు ఆదర్శ పురుషుడు. ఆయనలా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన దేవుడయ్యారు. మనం మనుషులుగా ఉన్నాం. దర్శకుడు ఓం రౌత్.. ఈ కథ చెప్పగానే ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే ఇది దేశానికే అత్యంత విలువైన చిత్రం కదా. నేను చేయగలనా లేదా ఆలోచించి, మూడు రోజుల తర్వాత ఓకే చెప్పాను. నా జీవితంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్నాను. రౌత్ తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే, మన దేశ సంస్కృతిని తెరపై చూపించే అవకాశం ఉండటం వల్లే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను’ అని ప్రభాస్, ఆదిపురుష్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.