ప్రముఖ రచయిత్రి కన్నుమూశారు. తన కథలతో తెలుగు సాహిత్య రంగానికి ఎంతో సేవలందించిన ఆమె మృతి తీరనిలోటనే చెప్పాలి. ఆమె రచనల్ని ఇష్టపడే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సుప్రసిద్ధ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కే రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1930 డిసెంబర్ 31న కోటనందూర్‌లో జన్మించిన రామలక్ష్మి.. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తి చేశారు. 1951 నుంచి ఆమె రచనలు చేయడం మొదలుపెట్టారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యంతో పాటు ప్రాచీనాంధ్ర సాహిత్యాన్నీ అభ్యసించారు. తెలుగు స్వతంత్ర ఇంగ్లీషు విభాగంలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు రామలక్ష్మి.
స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వర్తించారు రామలక్ష్మి. 1954లో కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్రతో రామలక్ష్మి పెళ్లి జరిగింది. అనంతరం ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో ఆమె రచనలు చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రచనల విషయానికొస్తే.. ‘విడదీసే రైలుబళ్లు’, ‘అవతలి గట్టు’, ‘మెరుపుతీగె’, ‘తొణికిన స్వర్గం’, ‘మానని గాయం’, ‘ఆణిముత్యం’, ‘పెళ్లి’, ‘ప్రేమించు ప్రేమకై’, ‘ఆడది’, ‘ఆశకు సంకెళ్లు’, ‘కరుణ కథ’, ‘లవంగి’ వంటి కథాసంకలనాలను రామలక్ష్మి రచించారు. ‘ఆంధ్ర నాయకుడు’, ‘నీదే నా హృదయం’, ‘అద్దం’ లాంటి కథలను కూడా ఆమె రాశారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా గృహలక్ష్మి, స్వర్ణకంకణంతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు రామలక్ష్మిని వరించాయి.