ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోలతో సినిమా అంటే మొదటి ఛాయిస్ గా నిలిచింది ఈ టాలీవుడ్ బుట్ట బొమ్మ. దర్శక, నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారిన పూజా హెగ్డే.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. నాల్గవ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం పట్టేసింది. ప్రస్తుతం ఈ శ్రీదేవి.. ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్, జగపతిబాబు కూడా నటిస్తున్నారు.
కాగా ఇవాళ ఈ గోపికమ్మ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు బర్త్ డే వేడుకలు నిర్వహించారు. షూటింగ్ సెట్స్ లో ఆమె కోసం కేక్ తెప్పించి.. కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను ప్రేమించేది నా పనినే, షూటింగ్ నే. అలాంటి షూటింగ్ లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం కంటే ఉత్తమ మార్గం మరొకటి ఉండదు. అది కూడా ఆన్ సెట్స్ లో బర్త్ డే చేసుకోవడం అనేది సంతోషపరిచే విషయం. ఇక ఈ సినిమాలో నాలో కొత్త యాంగిల్ ని చూస్తారు. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ పూజా వెల్లడించింది. ప్రస్తుతం పూజా బర్త్ డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ బుట్ట బొమ్మ అక్టోబర్ 13 1990లో పుట్టింది. ఇవాళ్టితో 32వ ఏటలోకి అడుగుపెట్టింది. అదన్నమాట విషయం.