సినీ ప్రేక్షకులు పాన్ ఇండియా సినిమాల అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమాలలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమాను.. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇక బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 460 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ 1 తమిళంలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే.. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, శోభిత లాంటి స్టార్ కాస్ట్ కలిగిన ఈ సినిమాకు సీక్వెల్ ఉందనే విషయం తెలిసిందే. పార్ట్ వన్ రిలీజై రెండు నెలలు కూడా గడవకముందే ‘పొన్నియన్ సెల్వన్-2’ గురించి వార్తలు మొదలయ్యాయి. అందులోనూ ఏకంగా మూవీ రిలీజ్ డేట్ గురించి కథనాలు రావడం గమనార్హం.
ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్-2 రిలీజ్ అనేది మొదటి భాగం విడుదలైన 6 నెలలకు ఉంటుందని ఇదివరకు ప్రమోషన్స్ లో చిత్రబృందం తెలిపింది. దాని ప్రకారం.. పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ ని.. 2023 ఏప్రిల్ 28న ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. అయితే.. తెలుగులో మాత్రం మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదని సమాచారం. అయినప్పటికీ, పొన్నియన్ సెల్వన్ 1 ఇప్పుడు అన్ని భాషలలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. చూడాలి మరి ముందే చెప్పినట్లుగా పొన్నియన్ సెల్వన్ 2 త్వరగా తీసుకొస్తారేమో!